Better Time To Drink Coconut Water :మనకు ఏమాత్రం నీరసంగా అనిపించినా, అనారోగ్యంగా ఉన్నా, వేడి చేసినట్లుగా అనిపించినా వెంటనే కొబ్బరి నీళ్లు గుర్తొస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎలాంటి రసాయనాలూ లేకుండా సహజంగా లభించే కోకోనట్ వాటర్లో.. బోలెడు పోషకాలు ఉంటాయి. అయితే.. కొబ్బరి నీళ్లు(Coconut Water) ఎప్పుడు బడితే అప్పుడు కాకుండా.. ఒక నిర్దిష్ట సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. మరి, ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కొబ్బరి నీళ్లు తాగడానికి మంచి సమయం ఎప్పుడంటే..?
మనమందరం ఎక్కువగా పగటిపూట హైడ్రేటింగ్ పానీయాలను ఇష్టపడతాం. అవి మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తినీ అందిస్తాయి. అయితే.. కొబ్బరి నీళ్ల విషయానికి వస్తే.. ఉదయాన్నే తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా మితంగా తీసుకోవాలంటున్నారు. ఇక, రాత్రివేళ వీటిని తీసుకోకపోతేనే మంచిదని అంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వేళలోపు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగానే ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా ఈ నీళ్లను తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కోకోనట్ వాటర్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, శరీర జీవక్రియలకు అవసరమైన ఉత్తేజాన్ని అందిస్తుంది. "ది జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ బయోకెమికల్ సైన్సెస్"లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని కనుగొన్నారు. "ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని తేలింది.