What Will Happen If I Stop Eating Onions :ప్రపంచంలోని చాలా రకాల వంటల్లో ఉల్లిపాయలు ముఖ్యమైన పదార్థంగా నిలుస్తాయి. వివిధ పోషక విలువలతో పాటు ప్రత్యేకమైన రుచిని కలిగిన ఉల్లిపాయలు మీ వంటలకు స్పెషల్ టేస్టును అందిస్తాయి. ప్రతి రోజు మనం వండుకునే రకరకాల కూరల నుంచి బిర్యానీ, స్నాక్స్ వంటి ఆహార పదార్థాల వరకు ఉల్లిపాయలు లేనిదే రుచి రాదనడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఉల్లిపాయతో వచ్చిన చిక్కేంటంటే, ఇది తిన్న తర్వాత నోటి నుంచి వచ్చే వాసన చాలా చికాకుగా ఉంటుంది. ఈ ఒక్క కారణంతోనే ఎక్కువ మంది ఉల్లిపాయకు దూరంగా ఉంటారు. అయితే ఓ నెల పాటు ఉల్లిపాయలు తినడం మానేస్తే ఏం జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆనియన్స్కు దూరంగా ఉంటే శరీరానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలకు నెల రోజుల పాటు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు చాలా రకాల సమస్యలు వస్తాయంటే మీరు నమ్ముతారా? సీనియర్ డైటీషియన్లు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, కణాల ఎదుగులకు, ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడతాయి. ఉల్లిపాయల్లో అలిసిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు, యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.