తెలంగాణ

telangana

బొల్లిమచ్చలు ఎందుకు వస్తాయి? - లక్షణాలు? చికిత్స ఎలా ఉంటుందో తెలుసా? - Vitiligo Causes and Symptoms

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 1:35 PM IST

Vitiligo Causes : కొంత మంది బొల్లి మచ్చలతో బాధపడుతుంటారు. ఇది జబ్బు కాకపోయినా.. అందాన్ని దెబ్బతీసే విధంగా ఉండడంతో.. బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. అసలు ఈ బొల్లి ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Vitiligo Causes
Vitiligo Causes (ETV Bharat)

Vitiligo Causes and Symptoms:మనం అందంగా కనిపించేలా, చూడగానే ఆకట్టుకునేలా చేసేది చర్మమే. అయితే కొద్దిమంది చర్మం మీద బొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. నిజానికి ఇందులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మచ్చల మీద దురద, మంట వంటి బాధలేవీ తలెత్తవు. కానీ.. అందవిహీనంగా ఉంటాయనే భావనతో.. బాధపడుతుంటారు. అసలు ఈ బొల్లి ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? దీనికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బొల్లి మచ్చలకు కారణాలు:ఆధునిక వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటి వరకూ బొల్లి మచ్చలు రావడానికి గల స్పష్టమైన కారణాలను వైద్యులు ఇప్పటికీ కనుగొనలేకపోయారు. ఇది ఎందుకొస్తుందనేందుకు స్పష్టమైన కారణాలు లేకపోయినా.. పలు అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

రోగనిరోధక వ్యవస్థపై దాడి:మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల (ఆటోఇమ్యూన్‌) బొల్లి మచ్చలు వస్తున్నట్టు హైదరాబాద్​లోని గాంధీ హాస్పిటల్​లో చర్మ, సుఖవ్యాధుల విభాగం హెడ్​ అండ్​ ప్రొఫెసర్​ డాక్టర్​ జి.నరసింహారావు నేత అంటున్నారు. చర్మం పై పొరలో మెలనోసైట్‌ కణాలుంటాయి. ఇవి మెలనిన్‌ అనే వర్ణ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా చర్మానికి రంగును తెచ్చిపెడతాయి. వీటి మీద రోగనిరోధక వ్యవస్థ పొరపాటున దాడి చేసినప్పుడు అవి నాశనమవుతాయి. దీంతో రంగు ఉత్పత్తి తగ్గిపోయి, చర్మం పాలి పోయినట్టు అవుతుంది. అక్కడ తెల్లగా, లేత గులాబి రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీన్నే బొల్లి (విటిలిగో) అని పిలుస్తారు.

జన్యుపరమైన కారణాలు:వంశపారంపర్యంగా కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఒత్తిడి:తీవ్రమైన ఒత్తిడి బొల్లి మచ్చలు ఏర్పడడానికి లేదా దానిని మరింత తీవ్రతరం చేయడానికి కారణమవుతుందని చెబుతున్నారు.

రసాయనాలకు గురికావడం:కొన్ని ఇన్ఫెక్షన్లు, గాయాలు లేదా రసాయనాలకు గురికావడం వంటి ఇతర కారణాలు కూడా బొల్లికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.

సూర్యరశ్మికి గురికావడం:సూర్యరశ్మికి గురికావడం వల్ల కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అతినీలలోహిత (UV) కిరణాలు మెలనోసైట్‌ కణాలను దెబ్బతీస్తాయని.. దీని వల్ల విటిలిగో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2004లో పిడియాట్రిక్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సూర్యరశ్మికి ఎక్కువగా గురయ్యే పిల్లలలో బొల్లి మచ్చలు ఏర్పడే అవకాశం 2 రెట్లు ఎక్కువని కనుగొన్నారు. తల, మెడ ప్రాంతాలలో సూర్యరశ్మికి గురయ్యే పిల్లలలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు నివేదించారు. ఈ పరిశోధనలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు, బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్గరెట్ లీ పాల్గొన్నారు.

బొల్లి మచ్చలు లక్షణాలు:చర్మం రంగును కోల్పోవడం వల్ల ఏర్పడే తెల్లటి మచ్చలు బొల్లి సమస్యకు ప్రధాన లక్షణం. ఈ మచ్చలు వివిధ పరిమాణాలు, ఆకారాలలో ఉంటాయి. కొంతమందిలో జుట్టు, కనుబొమ్మలు, వెంట్రుకల వంటి శరీరంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి.

ఎవరికి వస్తుంది:ఈ సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చని అంటున్నారు. సాధారణంగా 25 సంవత్సరాల లోపు ఈ సమస్య బయటపడుతుంటుందని.. చిన్నవయసులో బొల్లి వస్తే త్వరగా విస్తరిస్తుందని.. తీవ్రంగానూ ఉంటుందంటున్నారు. మధ్యవయసులో, పెద్ద వయసులో మొదలైతే అంత తీవ్రంగా ఉండదని.. చికిత్సకూ బాగా స్పందిస్తుందని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్​, ల్యూపస్, అనుసంధాన కణజాల సమస్యల వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బులు గలవారికి బొల్లి వచ్చే ముప్పు ఎక్కువంటున్నారు.

బొల్లి మచ్చలు రకాలు:బొల్లి మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావొచ్చంటున్నారు. కొందరికి ఏదో భాగంలో, ఏదో ఒక చోట వస్తుంటాయి. దీనిని లోకలైజ్డ్‌ అంటారు. కొందరికి ఒళ్లంతా రావొచ్చు. ఈ పరిస్థితిని వల్గారిస్‌ అంటారు. కొందరికి శరీరంలో ఒక వైపుననే.. అంటే ఒక చేయి, ముఖం, ఛాతీలో ఏదో ఒకవైపో కనిపించొచ్చని.. దీనిని సెగ్మెంటల్‌ అంటారంటున్నారు. కొందరికి కేవలం వేలి చివర్లు, పెదవుల చివర్లు, ముక్కు కొసలు, రెప్పల చివరల్లో రావొచ్చని.. ఈ పరిస్థితిని యాక్రోఫేషియల్‌ అంటారని చెబుతున్నారు.

చికిత్స ఎలా: బొల్లి గలవారికి ఆత్మ విశ్వాసాన్ని కల్పించటం ముఖ్యమని.. ఇందుకు కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి భరోసా ఇవ్వటం మేలు చేస్తుందంటున్నారు. చాలా వరకు మచ్చలు తగ్గుతాయని.. ఒకవేళ మచ్చలు తగ్గకుండా, క్రమంగా పెరుగుతున్నట్టయితే చికిత్స అవసరమవుతుందంటున్నారు. అలాగే బొల్లి ఉన్న వారికి విటమిన్లు ఎ, డి, ఇ మేలు చేస్తాయని.. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగనిరోధకశక్తి గతి తప్పకుండా చూస్తాయంటున్నారు. మందులతో తగ్గకుండా, మచ్చ స్థిరంగా ఉంటున్నప్పుడు శస్త్రచికిత్సలు ఉపయోగపడతాయంటున్నారు. కాబట్టి బొల్లి మచ్చలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తే ఫలితం ఉంటుందంటున్నారు.

గమనిక : పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు బొల్లి మచ్చలతో బాధడుతున్నట్లయితే.. మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇవీ చదవండి:

ఇష్టంగా పాప్​కార్న్​ తింటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!

అలర్ట్​: మీరు ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారా? - అయితే మీకు "బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్" ఉన్నట్టే!

ABOUT THE AUTHOR

...view details