Walking Health Benefits in Telugu : సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. శక్తి తగ్గుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే మజిల్ లాస్.. 50 తర్వాత వేగవంతం అవుతుంది. అప్పుడు సరిగ్గా నిలబడడం.. నడవడం కూడా కష్టమవుతుంది. అందుకే.. ముందు నుంచే హెల్త్ బ్యాలెన్స్ చేస్తూ.. బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అయితే.. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. రోజూ వాకింగ్ సరిపోతుందంటున్నారు. నడక(Harvard Medical School రిపోర్టు) మిమ్మల్ని బ్యాలెన్స్‌గా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందని సూచిస్తున్నారు.
"ఆరోగ్యమే మహాభాగ్యం" అనేది ఎంత నిజమో.. నడక వల్ల మనకు ఆ భాగ్యం లభిస్తుందనే మాట కూడా అంతే నిజం. నడక ఆరోగ్యానికి మంచి ఔషధం లాంటిదని చెబుతున్నారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఎండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె. శివరాజు. రోజువారీ వాకింగ్(Walking) అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందంటున్నారు.
రక్త ప్రసరణ మెరుగు : నడక మీ కండరాలకు పోషకాలు, ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆరోగ్యం, పనితీరును ప్రోత్సహిస్తుందంటున్నారు డాక్టర్ శివరాజు.
కండరాలు బలోపేతం అవుతాయి : రెగ్యులర్ వాకింగ్ మీ మొత్తం ఓర్పును పెంచుతుంది. అంతేకాదు.. ఇది పరోక్షంగా మీ కండరాల బలానికి తోడ్పడుతుందంటున్నారు.
కేలరీలు బర్న్ అవుతాయి : వాకింగ్ ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుందంటున్నారు వైద్యులు.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది : నడక.. గుండె జబ్బులు, మధుమేహం(Dibetes) వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. వాకింగ్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చంటున్నారు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే.. ఆటోమెటిక్‌గా మీ పనితీరు మెరుగుపడుతుంది. దాంతో మీ ఆర్థిక సంపాదన మెరుగవుతుంది. ఫలితంగా ఇది మంచి జీవనం గడపడానికి దోహదపడుతుందంటున్నారు.
హెల్దీగా ఉండటానికి - ఏ వయసువారు ఎంత దూరం నడవాలి ? మీకు తెలుసా ?
నడకను ఎలా ప్రారంభించాలంటే?
- వాకింగ్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఒకేరోజు ఎక్కువమొత్తంలో నడవాల్సిన పనిలేదు. మొదటగా ప్రారంభించేవారు తక్కువ దూరం నడవడంతోనే స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత క్రమక్రమంగా వ్యవధి, వేగాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు.
- మీకు ఒంటరిగా నడవడం ఇబ్బందిగా అనిపిస్తే.. ఇప్పటికే మీ ఇంటి దగ్గరలో వాకింగ్ వెళ్లే వారితో పరిచయాలు పెంచుకోండి. ఇది మిమ్మల్ని మరింత ఆనందదాయకంగా, ఉత్సాహంగా వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తుంది.
- అలాగే.. మీ కండరాలకు తగినంత శారీరక శ్రమ లభించేలా చూసుకోవాలి. అందుకోసం.. కాలిబాటలు, దారులు లేదా కొండలు వంటి విభిన్న ఉపరితలాలపై నడవడానికి ప్రయత్నించాలంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ శరీరానికి అనుగుణంగా.. మీ వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.
- ఒకవేళ మీరు ఇప్పటికే వ్యాయామం చేస్తుంటే.. మీ ప్రస్తుత దినచర్యకు బాగా సరిపోయే నడక ప్రణాళికను స్టార్ట్ చేయండి. అంటే.. మీ వాకింగ్ ప్లాన్ సులభంగా అనిపిస్తే.. సమయం, దూరం పెంచడం లేదా కొండలను మీ వ్యాయామంలో చేర్చుకునేలా చూసుకోవాలి.
- వారానికి కనీసం 150 నిమిషాల నడకను లక్ష్యంగా పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.
- చివరగా.. ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని నడవడానికి ఇబ్బంది కలిగిస్తే.. వెంటనే ఆపేసి సంబంధిత వైద్యులని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వాకింగ్ Vs మెట్లు ఎక్కడం - బరువు తగ్గడానికి ఏది బెటర్ ఆప్షన్!