People Problems In Narayanpur : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణపూర్ చెరువు నిండుకుండలా మారింది. ఇళ్లలోకి నీటి ఊటలు వస్తుండగా గోడలు తడిసిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చిన ప్రతి సారి తమ గ్రామాలను స్వాధీనం చేసుకుని పునరావాసం కల్పించాలని నారాయణపూర్ ముంపు బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి ముంపు బాధితులకు భరోసా కల్పించారు.
నష్టపరిహారం చెల్లించాలి : నారాయణపూర్ జలాశయం నిర్మాణంలో కోల్పోయిన 236 ఎకరాల వ్యవసాయ భూములతో పాటు బావులు, పైపులైన్లకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పదేళ్ల క్రితమే రూ. 10 లక్షల చొప్పున ప్రకటించినా ఇంత వరకు మంజూరు కాలేదు. మంగపేటలో 11 ఇళ్లు, నారాయణపూర్ చెరువు కట్టకింద 31 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని గతంలో అధికారులు గుర్తించారు. నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా బాధితులకు చెల్లించలేదు.
భయాందోళనలో ముంపు బాధితులు : రెండేళ్ల కిందట నారాయణపూర్ చెరువు, గంగాధర ఎల్లమ్మ చెరువు కట్టకు గండ్లు పెట్టగా వరద ఉద్ధృతితో భయానక పరిస్థితి నెలకొంది. నారాయణపూర్ చెరువు కట్ట వెడల్పు చేయకుండా కేవలం చెరువు మత్తడి వద్ద ఎత్తు పెంచడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి కట్టకు సమాంతరంగా వరద చేరుతుంది. ఏ క్షణంలోనైనా కట్ట తెగిపోయే ప్రమాదం ఉండటంతో ముంపు బాధితులు భయాందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ పునరావాసం కోసం ఎదురుచూపులు : చెరువు కట్ట కింద ఉన్న తమ ఇళ్లలోకి నీటి ఊటతో వస్తువులన్నీ తడిసిముద్దవుతున్నాయి. పాములు, తేళ్లు వస్తున్నాయని గోడు వెల్లబోస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిదులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు. తమ ఇళ్లను స్వాధీనం చేసుకొని ప్రభుత్వం పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
"భారీ వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి వస్తుంది. ఇళ్లలోకి నీటి ఊటలు వస్తుండగా గోడలు తడిసిపోతున్నాయి. తమ ఇళ్లను స్వాధీనం చేసుకొని ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. గతంలో నిధులు మంజూరు చేసినా ఒక్క పైసా కూడా మాకు అందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలి."-ముంపు బాధితులు
ఆపదొచ్చినా అంబులెన్స్ రాదు - అపాయంలోనూ ఎద్దులబండే దిక్కు - RAIPUR VILLAGE TRANSPORT ISSUES
'మా ఊరు రావాలంటే ఏరు దాటాల్సిందే - అందుకే మాకెవ్వరూ పిల్లనిస్తలేరు' - Gurramgadda Village Problems