Minister Bhatti slams BRS : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంపై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేల దాడి వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం సహించబోదని, ఏం చేయాలో అది చేస్తుందన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ : రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, కాంగ్రెస్ పాలన అసమర్థుని శవయాత్రలా ఉందన్న కేటీఆర్ కామెంట్లపై మంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. అన్ని పొగొట్టుకున్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని దుయ్యబట్టారు.
ప్రతిపక్షం గొంతు వినిపించాలి : అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సైతం లేకుండా బీఆర్ఎస్ గతంలో తాను చేపట్టిన సీఎల్పీ సీటును సైతం గుంజుకున్నారని మంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. వాళ్ల మాదిరిగా తాము ప్రవర్తించడం లేదని, అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని కోరుకుంటున్నామన్నారు. ప్రతిపక్ష నేతలంటే తమకు గౌరవం ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఏ పార్టీకి చెందిన నేతనో చెప్పాలని విలేకర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు ఎవరో, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరో స్పీకర్ వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనని, బీజేపీ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతోందని మంత్రి భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.
"బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించింది. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం సహించబోదు. ఏం చేయాలో అది చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సైతం లేకుండా సీఎల్పీ సీటును సైతం గుంజుకున్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు". - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
త్వరలోనే వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపుసెట్లు : డిప్యూటీ సీఎం భట్టి - Many development programs