Is it Safe to Remove Wisdom Teeth : మనిషికి 32 పళ్లు ఉంటాయి. యుక్త వయసు వరకు 28 దంతాలే వస్తాయి. 20 సంవత్సరాల తర్వాత ఎగువ, దిగువ దవడలలో రెండు కొత్త దంతాలు వస్తూ ఉంటాయి. వీటినే జ్ఞాన దంతాలని అంటారు. ఇక జ్ఞానదంతాలు వచ్చేప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. మరి.. జ్ఞానదంతాలు వచ్చేప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది? ఆ దంతాలు తీయించుకోవడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
నొప్పి ఎందుకు వస్తుంది..? జ్ఞానదంతాల్లో నొప్పి రావడానికి మన శరీర ఎదుగుదల ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో దవడలో జ్ఞానదంతం మొలవటానికి అవసరమైనంత చోటుండదు. అందుకే.. వయసుతోపాటు దవడ సైజూ పెరుగుతూ వస్తుందని, తగినంత సైజు పెరిగాక జ్ఞానదంతం రావడం స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. అయితే.. కొందరిలో ఈ దవడ సైజు అవసరమైనంత పొడవుగా పెరగదు. అలాంటి వారికి నొప్పి వస్తుందని అంటున్నారు.
మన పూర్వీకులు గట్టి గట్టి గింజలు, గింజపప్పులు, పచ్చి కూరగాయలు, మాంసం వంటి కఠినమైన పదార్థాలు తినేవారు. దీంతో చిన్నప్పుడే దవడ పొడవుగా పెరిగేది. కాలం గడిచే కొద్దీ.. మెత్తటి పదార్థాలు తినటం మొదలైంది. దీంతో దవడ పెరుగుదల ఆలస్యమవుతూ వచ్చింది. యుక్తవయసు వచ్చేంతవరకు జ్ఞానదంతం అవసరం లేకపోవటం కూడా ఇది ఆలస్యంగా రావటానికి కారణమేనని అంటున్నారు. కొన్నిసార్లు దవడ మీద పలువరస ఉండే స్థలంపై మిగతా దంతాలన్నీ కాస్త విడివిడిగా వస్తే.. జ్ఞానదంతం దశ, దిశ మారుతుందని కూడా చెబుతున్నారు.
జ్ఞానదంతం తొలగించొచ్చా..?: జ్ఞానదంతం నొప్పి కలిగితే వెంటనే తొలగించాలని చాలా మంది భావిస్తారు. అయితే.. ప్రతిసారీ తొలగించాల్సిన అవసరం లేదంటున్నారు. ఆ దంతం పూర్తిగా బయటకు ఎదిగే అవకాశాలున్నప్పుడు దాన్ని తొలగించడం సరికాదంటున్నారు. పూర్తిగా బయటకు రాకుండా, కొద్దిగా మాత్రమే బయటకు కనిపిస్తూ, నమలడానికీ, నోటి ఆరోగ్యానికీ ఇబ్బందిగా మారినప్పుడు మాత్రమే దానిని తీయాలని సూచిస్తున్నారు.
జ్ఞానదంతం ఎదుగుతున్నప్పుడు వచ్చే సమస్యలు ఇవే: జ్ఞానదంతాలు చిగురును చీల్చుకు వచ్చే సమయంలో కలిగే నొప్పి, వాపు, ఆ భాగం ఎర్రబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు చిగుర్ల వరస నుంచి చీము నొప్పి కారణంగా మెడ వద్ద ఉండే లింఫ్ గ్రంథులు ఉబ్బుతాయి. కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని మింగడంలోనూ ఇబ్బందులు ఉంటాయి.
దంతాలు విరిగిపోతున్నాయా? ప్రధాన కారణాలు ఇవేనట!
జ్ఞానదంతాలు తొలగించినప్పుడు వచ్చే సమస్యలు: జ్ఞానదంతాలు తొలగించినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని NIH బృందం వెల్లడించింది. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అయితే.. అవి సాధారణంగా తాత్కాలికమైనవేనని పేర్కొంది. ఈ సమస్యలు ప్రతి వ్యక్తికీ భిన్నంగా ఉండవచ్చని కూడా నిపుణులు తెలిపారు. ఆ సమస్యలు చూస్తే..
నొప్పి: ఇది చాలా సాధారణమైన సమస్య. సర్జరీ తర్వాత కొన్ని రోజుల వరకు నొప్పి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. నొప్పి నివారణకు మందులు తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చంటున్నారు.
రక్తం: సర్జరీ తర్వాత ఆ ప్రదేశంలో కాసేపు రక్తం కారడం సహజం. కొన్ని గంటల పాటు గట్టిగా నోరు మూసుకోవడం ద్వారా రక్తస్రావం ఆగిపోతుంది. అలాగే సర్జరీ చేసిన ప్రాంతంలో వాపు కూడా వస్తుంది.
ఇన్ఫెక్షన్: అరుదుగా, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తినడానికి, తాగడానికి ఇబ్బంది: సర్జరీ తర్వాత కొన్ని రోజుల వరకు తినడానికి, తాగడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చని చెబుతున్నారు. కాబట్టి కొన్ని రోజుల వరకు మృదువైన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
నరాల నొప్పి: జ్ఞాన దంతాలు తొలగించేటప్పుడు నరాల నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. 2019లో జర్నల్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. జ్ఞాన దంతాల తొలగింపు సమయంలో నరాలు దెబ్బతినే ప్రమాదం దాదాపు 3.6% ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో శాన్ ఫ్రాన్సిస్కోలోని University of the Pacificలో ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగంలో క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ Christopher J. Louie, DDS, MD పాల్గొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
దంతాలు దెబ్బతిన్న తర్వాత బాధపడితే నో యూజ్ - బ్రష్ చేయడం ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి!
ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే మీ దంతాలు దెబ్బతినడం ఖాయం!