Raj Tharun Bhale Unnaduga Movie : హీరో రాజ్‌తరుణ్ తాజాగా 'భలే ఉన్నాడే'తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. అయితే గతంలో ఆయన నటించిన సినిమాలన్నీ యావరేజ్‌గా ఉండటం వల్ల ఈ చిత్రంతో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి ఈ 'భలే ఉన్నాడే' మూవీ ఎలా ఉందంటే?
కథేంటంటే :
వైజాగ్‌లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి రాధ (రాజ్‌తరుణ్). శారీ డ్రేపర్ (అమ్మాయిలకు చీర కట్టే వృత్తి)గా పని చేస్తుంటాడు. గుణంలో రాముడు. తల్లి గౌరి (అభిరామి)కి అన్ని పనుల్లోనూ అతడు సాయంగా ఉంటాడు. అయితే గౌరి పని చేసే బ్యాంకులోనే కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది కృష్ణ (మనీశా). ఆమె కాస్త మోడ్రన్ అమ్మాయి. ప్రేమ, పెళ్లి విషయాల్లో తనకంటూ కొన్ని ఐడియాలజీలు ఉంటాయి. అయితే ఆమె గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంటలకు ఫిదా అయిపోతుంది. దీంతో రాధ మొహం కూడా చూడకుండానే అతడిపై మనసు పారేసుకుంటుంది.
ఇక రాధ కూడా కృష్ణను చూడకుండానే లంచ్ బాక్స్ ద్వారానే తను పంపే లేఖలు చదువుకుంటూ ప్రేమ పెంచుకుంటాడు. అయితే ఇద్దరూ ఒకరికొకరు పరిచయమైన తర్వాత కూడా రాధ తన హద్దుల్లోనే ఉంటాడు. వీళ్లిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవ్వగా, ఎంగేజ్మెంట్ టైమ్‌లో కృష్ణ ఫ్రెండ్ ఆమెకు ఓ విషయం చెబుతుంది. దీంతో కృష్ణకు రాధ క్యారెక్టర్‌పై అనుమానం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అతను అసలు పెళ్లికి పనికొస్తాడా?లేదా? తెలుసుకునేందుకు ఓ పరీక్షకు సిద్ధమవుతుంది. మరి ఆ తర్వాత వీరిద్దరి లవ్ ట్రాక్ ఏమైంది?రాధ అమ్మాయిలకు దూరంగా ఉండటానికి గల అసలు కారణమేంటి? అటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇక సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే :
రాముడిలా ఉండాలనుకునే ఓ యువకుడిని అమ్మాయిలు, అలాగే ఈ సమాజం ఈ రోజుల్లో ఎలా చూస్తుంది? శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మగతనమా లేకంటే మనసిచ్చిన అమ్మాయిని ఏ కష్టం పడకుండా కాపాడుకోవడం మగతనమా? అసలు ఈ నిజమైన ప్రేమ అనేది ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు ఈ సినిమా డైరెక్టర్ తనదైన స్టైల్లో క్లారిటీగా చెప్పాలనుకున్నారు. ఈ జనరేషన్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. వాస్తవానికి ఇందులో కొన్ని బోల్డ్ పాయింట్స్ ఉన్నా, డైరెక్టర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని కామెడీ, అలాగే ఎమోషన్స్‌తో కలిపి వీలైనంత క్లీన్‌గా చూపించే ప్రయత్నం చేశారు.
ఫస్ట్ హాఫ్‌లో ఓవైపు హీరో హీరోయిన్ లవ్‌ట్రాక్‌తో మరోవైపు తల్లీకొడుకుల అనుబంధాలతో సరదా సరదాగా సాగిపోతుంది. లంచ్ బాక్స్ వారధిగా ఆ జంట మధ్య సాగే లవ్ ట్రాక్, బయట ఇద్దరి మధ్య నడిచే టామ్ అండ్ జెర్రీ వార్ అన్నీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి.
ఎప్పుడైతే రాధ - కృష్ణల ప్రేమ కాస్త డీప్‌గా వెళ్తుందో అప్పుడే ఈ కథలో ట్విస్ట్ వస్తుంది. రాధను కవ్వించి తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటకు తీసేందుకు కృష్ణ చేసే ప్రయత్నాలు కాసేపు నవ్వించినప్పటికీ, ఆ తర్వాత కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇక రాధ - కృష్ణలు పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవడం, ఎంగేజ్మెంట్లో స్నేహితురాలు చెప్పిన మాట వల్ల కృష్ణకు రాధ క్యారెక్టర్‌పై డౌట్ ఏర్పడటం వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది.
అయితే రాధ ఇలా అమ్మాయిలకు దూరంగా ఉండటానికి వెనకున్న కారణమేంటనే నేపథ్యంగా సెకెండాఫ్ సాగుతుంది. ఫస్టాఫ్‌తో పోల్చితే ఇది చాలా చప్పగా సాగినట్లు అనిపిస్తుంది. రాధను పరీక్షించేందుకు ఆమెను కేరళలోని ఓ ఆశ్రమానికి తీసుకెళ్లడం. అక్కడ ట్రీట్మెంట్ పేరుతో శ్రీకాంత్ అయ్యంగార్ చేసే హంగామా కాస్త బోరింగ్‌గా నడుస్తుంది. అయితే ఆ ట్రాక్‌లో వచ్చే సింగీతం శ్రీనివాస్, లీలా శాంసన్ ఎపిసోడ్స్ అందర్నీ హత్తుకుంటుంది. ఇక రాధ, కృష్ణ విడిపోయిన తీరు అలాగే ఆ తర్వాత రాధ పడే మానసిక వేదన కథను ఎమోషనల్‌గా మారుస్తుంది. ఒక రొటీన్ క్లైమాక్స్‌తోనే ఈ సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుంది.
ఎవరెలా చేశారంటే :
రాధ పాత్రలో రాజ్‌తరుణ్ చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఈ సినిమాలో తన లుక్ కూడా బాగా కుదిరింది. అయితే సెకెండాఫ్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో తన నటన కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది. కృష్ణ పాత్రలో మనీశా ఎంతో అందంగా కనిపించింది. రాజ్‌తో తన కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. సీనియర్ నటి అభిరామి తల్లి పాత్రలో నటించి మెప్పించింది.
ఇక సింగీతం శ్రీనివాస్ కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ అవి ఆడియెన్స్‌పై బలమైన ప్రభావం చూపిస్తాయి. గోపరాజు రమణ, అమ్ము అభిరామి, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్ పాత్రలైతే అక్కడక్కడా కనిపించి కాస్త నవ్వులు పంచుతాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. కానీ చివరి వరకూ ఆయన ఆ టెంపోను కొనసాగించుంటే బాగుండేది. శేఖర్ చంద్ర మ్యూజిక్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పాటలు కూడా బాగున్నాయి ఉన్నాయి. నగేష్ సినిమాటోగ్రఫీ స్కిల్స్ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
బలాలు
- + కథా నేపథ్యం
- + రాజ్‌తరుణ్ నటన
- + ప్రథమార్ధంలోని వినోదం
బలహీనతలు
- - ఊహలకు తగ్గట్లుగా సాగే కథ
- - ద్వితీయార్ధం
- చివరిగా : 'భలే ఉన్నాడే' అనిపించకున్నా.. ఫర్వాలేదనిపిస్తాడు!
- గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!