What Is Popcorn Brain : నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ దాదాపుగా ఉంటుంది. అందులో తప్పకుండా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వీటిలో జనాలు గంటల తరబడి గడిపేస్తున్నారు. ఈ పరిస్థితి ముదిరిపోయి.. చాలా మంది బ్రెయిన్"పాప్‌కార్న్ బ్రెయిన్"గా మారిపోయిందని నిపుణులంటున్నారు. మరి.. ఏంటీ పాప్‌కార్న్ బ్రెయిన్? దీని నుంచి ఎలా బయటపడాలి ? అనేది ఇప్పుడు చూద్దాం.
మానసిక స్థితిని తెలుసుకోవడానికే :
సాధారణంగా మనం తినే పాప్‌కార్న్‌ను వేయించేటప్పుడు అవి చిన్నపాటి టపాసుల్లాగా పేలుతూ చెల్లచెదురుగా ఎగరి పడుతూ ఉంటాయి. అదే పనిగే ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించే వారి మనస్తత్వం కూడా పాప్‌కార్న్‌లాగా మారిపోతోందని అంటున్నారు నిపుణులు. కొంత సేపు వాట్సప్‌లో చాటింగ్ చేసి, మరికొంత సేపు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడడం, ఇంకొంత సేపు ఫేస్‌బుక్‌లో ఎవరు కొత్త పోస్ట్ పెట్టారని సెర్చ్ చేయడం వంటి పనులు చేస్తూ ఉండడం వల్ల.. వారి మానసిక స్థితి చంచలంగా మారిపోతోందని చెబుతున్నారు. ఈ కండీషన్ గురించి చెప్పడానికే "పాప్‌కార్న్ బ్రెయిన్" అనే పదాన్ని ఇటీవల ఎక్కువగా వాడుతున్నారు.
ఈ పాప్‌కార్న్ బ్రేయిన్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ?
ఆలోచల్లో మార్పు : దీర్ఘకాలం పాటు మన మెదడు "పాప్‌కార్న్ బ్రెయిన్"గా మారిపోతే.. పలు రకాల మానసిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చేసే పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. పరధ్యానం పెరిగిపోతుంది. ఆలోచన తీరులో ఊహించలేని మార్పులు కలుగుతాయని చెబుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి :
రోజులో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం వల్ల.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల ఎప్పుడూ చికాకు, గందరగోళం కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది :
మన మెదడు పాప్‌కార్న్ బ్రెయిన్‌గా మారిపోతే.. జ్ఞాపకశక్తి తగ్గిపోయే అవకాశం ఉందట. దీంతో.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చని హెచ్చరిస్తున్నారు.