Monkeypox Symptoms:కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతోంది. ఆ మహమ్మారే మంకీపాక్స్. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ ఇప్పుడు మన పక్క దేశమైన పాకిస్థాన్‌కు చేరింది. ఐరోపా ఖండంలోని స్వీడన్‌లోనూ తొలి కేసును గుర్తించారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అసలేమిటీ.. మంకీపాక్స్? దీన్ని తొలుత ఎక్కడ గుర్తించారు? ఇది ఎన్ని రకాలు? ఈ వ్యాధి లక్షణాలేంటి? ఎలా వ్యాపిస్తుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంకీపాక్స్ అంటే ఏమిటి?:మంకీపాక్స్(Monkeypox) అనేది ఒక వైరల్ వ్యాధి. ఇదీ స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. ఈ వైరస్ సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే.. దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు.
మనుషుల్లో మొదటి కేసు ఎప్పుడు గుర్తించారంటే?:1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఈ వ్యాధి సోకింది. ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా.. తొలిసారి 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. భారత్‌లోనూ 2022లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది.
మంకీపాక్స్ ఎన్ని రకాలంటే?:మంకీపాక్స్‌ను క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్) అనే రెండు వేరియంట్లుగా వర్గీకరించారు. ఇందులో క్లాడ్-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలూ వస్తాయి. దీనిలో మరణాల రేటు 1-10శాతం వరకు ఉంది. ఇక క్లాడ్-2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే.
ఎలా వ్యాప్తి చెందుతుందంటే?:మంకీపాక్స్ నేరుగా తాకడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే ఛాన్స్ ఉంది. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకడం వల్ల మనుషుల్లోకి వైరస్ ప్రవేశించవచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్-1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. అదీ లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.