తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్ : మీకు డయాబెటిస్​ ఉందా? - మీ కళ్లు ఎంత దెబ్బ తిన్నాయో చెక్​ చేసుకోండి! - What is Diabetic Retinopathy - WHAT IS DIABETIC RETINOPATHY

Diabetic Retinopathy: ప్రసుత్తం చాలా మంది డయాబెటిస్​తో బాధపడుతున్నారు. అయితే మధుమేహంతో ఇబ్బందిపడేవారిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందులో అత్యంత ప్రమాదకరమైనది డయాబెటిక్ రెటినోపతీ. మరి.. ఈ డయాబెటిక్ రెటినోపతీ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Diabetic Retinopathy Symptoms
What is Diabetic Retinopathy (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 10:41 AM IST

Updated : May 20, 2024, 11:04 AM IST

What is Diabetic Retinopathy:కనుగుడ్డు వెనకాల సున్నితమైన పొరలా ఉండే రెటీనా మన చూపులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కంట్లోకి వచ్చే కాంతిని విద్యుత్‌ సంకేతాలుగా మారుస్తుంది. వీటిని దృశ్యనాడి గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. మెదడు వాటిని దృశ్యాలుగా మార్చి చూపిస్తుంది. అయితే రెటీనాలో అతి సూక్ష్మమైన రక్తకేశ నాళికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగినప్పుడు ఇవి దెబ్బతింటాయి. దీనినే డయాబెటిక్​ రెటినోపతి అంటారని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా.. రకరకాల సమస్యలు తలెత్తి చూపు మందగించే ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు. మరోవైపు గ్లూకోజు.. రక్తంలోని హిమోగ్లోబిన్‌లోకీ చేరుకుంటుందని.. దీంతో ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయక.. రెటీనా పొరకు తగినంత ఆక్సిజన్‌ అందక దెబ్బతినటం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు.

1993లో The New England Journal of Medicineలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మధుమేహం లేని వారి కంటే షుగర్​ ఉన్న వారిలో డయాబెటిక్ రెటినోపతీ వచ్చే అవకాశం 25 రెట్లు ఎక్కువ కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్​ స్టేట్స్​లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, మాడిసన్‌లోని మెడ్‌స్కూల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓఫ్తాల్మాలజీలో ప్రొఫెసర్ డాక్టర్ బార్బరా క్లెయిన్​(Barbara Klein), MD పాల్గొన్నారు.

డయాబెటిక్​ రెటినోపతి లక్షణాలు:డయాబెటిక్‌ రెటినోపతీలో మొదట్లో ఎటువంటి లక్షణాలూ ఉండవని నిపుణులు అంటున్నారు. ముదురుతున్నకొద్దీ అక్షరాలు వంకరగా కనిపించటం, పక్కపదం కనిపించకపోవటం వంటివి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించే సరికే లోపల సమస్య తీవ్రమై ఉంటుందని గుర్తించాలని అంటున్నారు. అప్పటికీ జాగ్రత్త పడకపోతే చూపు పూర్తిగా పోయే పరిస్థితి తలెత్తొచ్చని.. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు చూపులో ఎలాంటి తేడా కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని.. విధిగా రెటీనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

రెండు దశల్లో:డయాబెటిక్‌ రెటీనోపతీని రెండు దశలుగా చూడొచ్చు. తొలిదశలో రెటీనా పొర మీదుండే రక్తకేశ నాళికల గోడలు దెబ్బతిని, ఉబ్బుతాయి. అక్కడ రక్తంలోని కొవ్వులు, ద్రవాలు లీక్‌ అవుతాయి. ఈ దశలో చూపు నెమ్మదిగా మందగిస్తూ వస్తుంటుంది. రెండో దశలో రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయి.. వాటిని భర్తీ చేసేందుకు కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తుంటాయి. వీటి నుంచి రక్తం స్రవించి పొర మీదికి చేరుకోవచ్చు. ఈ దశలో హఠాత్తుగా చూపు పోవటం గమనార్హం.

నిర్ధరణ ఎలా?:ఫండస్‌ ఎగ్జామినేషన్‌తో రెటీనా పొరను చూడటం ద్వారా సమస్యను గుర్తించొచ్చని నిపుణులు అంటున్నారు. స్లిట్‌ల్యాంప్‌లో కటకాల సాయంతోనూ కంటి పాపను పెద్దదిగా చేసి చూడొచ్చని.. దీంతో రెటీనా మధ్యభాగంలో ఉన్న సమస్యలు బయటపడతాయని అంటున్నారు. మధుమేహంతో బాధపడేవారు వీటిని తరచూ చేయించుకుంటే రెటీనా దెబ్బతినటాన్ని ముందే పసిగట్టొచ్చని సూచిస్తున్నారు.

  • రెటీనా మీది రక్తనాళాలు ఉబ్బినవారికి ఫ్లోరోసిస్‌ యాంజియోగ్రఫీ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇందులో మోచేతి వద్ద రక్తనాళం నుంచి రంగు పదార్థాన్ని ఎక్కించి, అది కంటికి చేరుకున్నాక రెటీనాను ఫొటోలు తీస్తారు. దీంతో కేశరక్తనాళాల తీరుతెన్నులు తెలుస్తాయని.. జబ్బు తీవ్రతా బయటపడుతుందని అంటున్నారు. అదే విధంగా రెటీనా మధ్యభాగంలో వాపు, నీరు వంటివి తెలుసుకోవటానికి ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టొమోగ్రఫీ పరీక్ష తోడ్పడుతుంది.

చికిత్స రకరకాలు:రెటీనా పొర మీద వాపు, రక్తం లీక్‌ కావటం వంటివి లేకపోతే గ్లూకోజును నియంత్రణలో ఉంచుకుంటే చాలని.. ప్రత్యేకంగా చికిత్సల అవసరమేమీ ఉండదని అంటున్నారు. కానీ సూక్ష్మ రక్తనాళాలు ఉబ్బటం.. వీటిల్లోంచి ద్రవాలు, కొవ్వులు లీకవటం వంటివి ఉంటే తప్పకుండా చికిత్స తీసుకోవాలని.. లేజర్‌ చికిత్సతో లీకవుతున్న రక్తనాళం భాగాన్ని మూసేసే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

అలాగే కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా ఆక్సిజన్‌ తగ్గినచోటును గుర్తించి, లేజర్‌తో దాన్ని మాడ్చేయటమూ మేలు చేస్తుందని.. పోయిన చూపు వీటితో తిరిగి రాకపోవచ్చు గానీ మున్ముందు చూపు మరింత తగ్గకుండా చూసుకోవచ్చంటున్నారు. అలాగే కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా యాంటీ వీఈజీఎఫ్‌ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెటీనా నుంచి రక్తస్రావమై, అది కనుగుడ్డులోని ద్రవంలో గడ్డ కట్టినట్టయితే శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుందని అంటున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే- రెటీనోపతీకి చేసే చికిత్సలన్నీ సమస్య మరింత ముదరకుండా చూసేవే గానీ పోయిన చూపును తిరిగి తెచ్చి పెట్టేవి కావని అంటున్నారు. మధుమేహం అలాగే కొనసాగుతూ రావటం వల్ల చికిత్స చేసిన చోట కాకుండా మరో చోట సమస్య ఆరంభం అయ్యి.. అది ఇంకాస్త తీవ్రంగానూ ఉండొచ్చని.. కాబట్టి మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవటం చాలా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

ముప్పు ఎవరికి?దీర్ఘకాలంగా మధుమేహం గలవారికి, గ్లూకోజు నియంత్రణలో లేనివారికి రెటీనా దెబ్బతినే ప్రమాదం ఎక్కువని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మధుమేహం వచ్చిన పదేళ్ల తర్వాత కానీ దాని దుష్ప్రభావాలు మొదలవుతుంటాయని.. అయితే గ్లూకోజు నియంత్రణలో లేకపోతే చాలా ముందుగానే ఇవి ఆరంభమవుతాయంటున్నారు. కాబట్టి డయాబెటిక్‌ రెటీనోపతీని నిర్లక్ష్యం చేయటం తగదని.. షుగర్​ ఉన్నవారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు.

మీరు కూడా Youtube డాక్టర్​ను నమ్ముతారా? - అయితే మీకు ఇడియట్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లే! - What is IDIOT Syndrome

తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవండి - మీ శరీరంలో ఊహించలేని మార్పు! - Benefits of Walking after Meals

Last Updated : May 20, 2024, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details