What is Baby Botox : ఎల్లప్పుడూ ముఖం అందంగా ఉండాలని.. చర్మం మెరుస్తూ కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొందరికి చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలు కనిపిస్తాయి. దీంతో.. చాలా మంది మేకప్ వేస్తూ ముడతలను కవర్ చేస్తుంటారు. మరికొందరు.. బొటాక్స్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు. దీనివల్ల గ్లామర్ పెరుగుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో ముడతలు కనిపించకుండా ఉండడానికి బేబీ బొటాక్స్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నారు. మరి.. ఈ "బేబీ బొటాక్స్" అంటే ఏంటి ? ముడతలు రాకుండా నేచురల్‌గా ఎలాంటి చిట్కాలు పాటించాలి? అనే ప్రశ్నలకు ప్రముఖ సౌందర్య నిపుణురాలు డాక్టర్ శైలజ సూరపనేని సమాధానం చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
బేబీ బొటాక్స్.. దీనినే 'మైక్రో బొటాక్స్' అని పిలుస్తారు. బేబీ బొటాక్స్ చికిత్సకు సంప్రదాయ బొటాక్స్‌కీ పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే బేబీ బొటాక్స్ అనేది.. చాలా తక్కువ మొత్తంలో సమస్య ఉన్నచోట ఇంజెక్ట్ చేస్తారు.
పెదవుల మీద గీతలు, ముడతలు పోవడానికీ, నుదురు, మెడ దగ్గర చర్మం సాగిపోయి గీతలు కనిపిస్తున్న వారికి బేబీ బొటాక్స్ బాగా పనిచేస్తుంది. సాధారణంగా 30-50 ఏళ్లలోపు వారికి ముడతలు, గీతలు కాస్త తక్కువగా ఉంటాయి. కాబట్టి, వారు ఈ చికిత్స చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. బేబీ బొటాక్స్ చికిత్స నాలుగు నెలలే పని చేస్తుంది. ముఖంపై ముడతలు, గీతలు తీవ్రంగా ఉంటే బొటాక్స్ చేసుకోవాలి.
చిన్నవయసులోనే ముడతలు ఎందుకు వస్తాయి ?
ప్రస్తుత కాలంలో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అలాగే చుట్టూ కాలుష్యం పెరిగిపోయింది. ఇంకా ఉద్యోగంలో ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపోకపోవడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మందిలో చిన్నవయసులో ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. ముడతలు తగ్గడానికి బొటాక్స్‌ని తక్కువ మొత్తంలోనే ఇవ్వాలి. లేకపోతే ముఖం అసహజంగా ఎలాంటి స్పందనా లేనట్లు కనిపిస్తుంది. కాబట్టి, ముడతలు పోయి, నేచురల్‌గా కనిపించేలా చేసే బేబీ బొటాక్స్ చికిత్స చేసుకోవడం ఎంతో మేలు.