Tips to Take Care of Teeth: మనకు ఎక్కువ ఇన్ఫెక్షన్లు నోటి ద్వారానే వ్యాపిస్తుంటాయి. అందువల్ల నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం చాలా కీలకం. అయితే, చాలా మంది బ్రష్ చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల దంతాలు, చిగుళ్లపై ప్రభావం పడి రక్తస్రావం అవుతుంది. అంతేకాదు నీట్‌గా బ్రష్ చేయకపోవడం వల్ల పంటినొప్పితో పాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే బ్రష్(National Institute of Health రిపోర్ట్) ఎలా చేసుకోవాలి? ఎలాంటి బ్రష్ ఉపయోగించాలి? బ్రష్‌ను ఎన్నిరోజులకు మార్చాలి? లాంటి ప్రశ్నలకు ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ వికాస్ గౌడ్ సమాధానం ఇస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
టూత్ బ్రష్‌ను ఎక్కువ రోజులు వినియోగించకూడదని డాక్టర్ వికాస్ గౌడ్ చెబుతున్నారు. సాధారణంగా 3 నెలలకు ఒకసారి బ్రష్‌ను తప్పనిసరిగా మార్చాలని వివరిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యానికి గురైనప్పుడు బ్రష్‌ను మార్చడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువ కాలం టూత్ బ్రష్ వాడడం వల్ల బ్రష్ మీద బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలుపుతున్నారు. అలాగే, రోజుకు 2 సార్లు(ఉదయం, రాత్రి) బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చాలా సేపు బ్రష్ చేయకుండా.. కేవలం 2 నుంచి 4 నిమిషాల పాటు మంచి టూత్ పేస్ట్‌తో బ్రష్ చేయడం మంచిదని వివరించారు.
చాలా మంది ఎక్కువ సేపు.. గట్టిగా తోమితే.. పళ్లు శుభ్రంగా ఉంటాయని నమ్ముతారు. కానీ ఇలా చేయడం వల్ల నష్టమే ఎక్కువ. చాలా ఎక్కువ సేపు బ్రష్ చేయడం వల్ల పంటిపైన ఉన్న ఎనామిల్ అరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సరైన బ్రషింగ్ పద్ధతులను పాటించాలి. కొందరు కేవలం పక్కలను మాత్రమే బ్రష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చిగుళ్లు అరిగిపోతాయి. బ్రష్ చేసేటప్పుడు పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి ఇలా గుండ్రంగా క్లీన్ చేయాలి. అనేక మంది పళ్ల ముందు వైపు మాత్రమే బ్రష్ చేస్తారు. లోపలివైపు చేయకపోవడం వల్ల పంటిపై గార పడుతుంది. పళ్లతో పాటు నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యమే. దుర్వాసన రాకుండా ఉండాలంటే టంగ్ క్లీనర్, బ్రష్‌తో తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. బొగ్గు పొడి, మంజన్ లాంటివి వాడం వల్ల పంటిపైన ఉన్న ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి."
--వికాస్ గౌడ్, డెంటిస్ట్