తెలంగాణ

telangana

ETV Bharat / health

కీళ్ల నొప్పులతో నడవలేకున్నారా? ఈ ఆహారం తింటే రన్నింగ్ చేస్తారట! - WHAT FOOD TO EAT TO CURE KNEE PAIN

-కీళ్ల నొప్పులతో ఇబ్బందా? ఈ ఆహారం తీసుకుంటే అంతా సెట్! -ఈ ఆహార నియమాలు పాటిస్తే కీళ్ల నొప్పులు మాయం అంటున్న వైద్యులు

What Food to Eat to Cure Knee Pain
What Food to Eat to Cure Knee Pain (Getty Images)

By ETV Bharat Health Team

Published : Nov 26, 2024, 1:17 PM IST

What Food to Eat to Cure Knee Pain:ప్రస్తుతం చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే, కొన్ని ఆహారపు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. నొప్పి, వాపును తగ్గించే యాంటీ ఇన్​ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలు కలిగిన పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికే కాకుండా.. వాపు నివారణకూ తోడ్పడతాయని వెల్లడించారు. ముఖ్యంగా కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు వివరించారు. ఇవి అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, ఆలివ్‌ నూనె వంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా ఇవే కాకుండా క్యాబేజీ, చిన్న క్యాబేజీ (బ్రసెల్స్‌ స్ప్రౌట్స్‌), గోబీ పువ్వు వంటి కూరగాయలూ వాపును తగ్గిస్తాయని అంటున్నారు. వీటిల్లో వాపును నివారించే గుణాలతో పాటు విటమిన్‌ సి సైతం ఎక్కువగానే ఉంటుందని.. ఇదీ కీళ్లవాతం తగ్గటానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

అయితే, వాపు తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడమే కాకుండా.. వాపును ప్రేరేపించే పదార్థాలకు దూరంగా ఉండటమూ అలవరచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మాంసంలో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయని.. ఇవి వాపును ప్రేరేపిస్తాయని అంటున్నారు. అందుకే వీలైనంతవరకు మాంసం తగ్గించటం మంచిదని సలహా ఇస్తున్నారు.

ఇంకా చిక్కుళ్లు, పప్పులు, వేరుశనగలు, టమాటాలు, బంగాళాదుంపలు వంటి వాటిల్లో లెక్టిన్లు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇవి వాపును ఎక్కువగా ప్రేరేపిస్తాయని.. అందుకే వీటిని మితంగా తీసుకోవటం మేలని అంటున్నారు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, మిఠాయిల వంటివీ వాపు ఎక్కువయ్యేలా చేస్తాయని.. వీటికి దూరంగా ఉండటం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఆహార నియమాలతో పాటు దీనికి వ్యాయామం తోడైతే మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్లు అరిగిపోయినవారు, ఊబకాయం గలవారు వీటిని పాటిస్తే కీళ్లపై ఒత్తిడి తగ్గుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల కీళ్ల మీద అంతగా భారం పడని ఈత వంటి వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ఎలాంటి నొప్పులు ఇబ్బందులు లేకుండా హాయిగా గడిపేలా చూసుకోవచ్చని వివరించారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఉదయాన్నే తేనె-నిమ్మరసం కలిపి తాగుతున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఒంటి కాలిపై ఎంతసేపు నిలబడతారు? ఈ టెస్ట్ పాస్ కాకపోతే ప్రమాదమేనట! మీరు ట్రై చేయండి!!

ABOUT THE AUTHOR

...view details