తెలంగాణ

telangana

ETV Bharat / health

మహిళల్లో ఈ విటమిన్లు తప్పక ఉండాలట- అవేంటి? ఎందులో లభిస్తాయో మీకు తెలుసా? - WHICH VITAMINS WOMEN SHOULD TAKE

-మహిళల ఆరోగ్యానికి ఈ విటమిన్లు ఉండాలట! -అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయట!

which vitamins women should take
which vitamins women should take (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 2, 2025, 3:58 PM IST

Which Vitamins Women Should Take: మహిళల రోజువారీ ఆరోగ్యంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒక బిలియన్​ కంటే ఎక్కువ మంది బాలికలు, మహిళలు.. రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు ఓ నివేదికలో తేలింది. ఇవే కాకుండా రుతుక్రమం, హార్మోన్ల మార్పులు, పునరుత్పత్తి సవాళ్ల మధ్య సరిగ్గా పనిచేయడానికి తగినన్ని విటమిన్లు అవసరం ఉంటుందని వివరిస్తున్నారు. అయితే చాలా మంది మహిళలు సంప్లిమెంట్స్​ రూపంలోనే విటమిన్లను తీసుకుంటారు. అలాకాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్లను ఆహారాల నుంచే పొందితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు ముఖ్యమైన విటమిన్లు ఏంటి? అవి ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్​ A: విటమిన్ ఏ లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ A కంటి చూపును పెంచడానికి.. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుందని అంటున్నారు. ముఖ్యంగా పునరుత్పత్తి ఆరోగ్యానికి ఈ విటమిన్​ కీలకమైనదని వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ విటమిన్​ను రెగ్యులర్​గా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకోవచ్చని పేర్కొన్నారు. చేపలు, పాలు, గుడ్లు, టమాటా, క్యారెట్, జామపండ్లు, బ్రొకోలీ, కాలే, బొప్పాయి, పీచ్, గుమ్మడికాయ, పాలకూర, వంటి వాటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందని అంటున్నారు.

విటమిన్​ B3: మహిళలకు బి విటమిన్లు చాలా ముఖ్యమైనవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కణాల అభివృద్ధికి, వాటి పనితీరుకు విటమిన్​ B3 చాలా ముఖ్యమైనదని అంటున్నారు. పోషకాలను శక్తిగా మార్చడం, DNA, నాడీవ్యవస్థ పనితీరు సహా అనేక శారీరక విధుల్లో విటమిన్ బీ 3 కీలకంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఇది ట్యూనా చేపలు, పల్లీలు, పుట్టగొడుగులు, గోధుమలు, పాలు, గుడ్లు, బీన్స్​ వంటి పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుందని తెలిపారు.

విటమిన్ B6: శరీరంలో హార్మోనుల ఉత్పత్తికి, బ్రెయిన్ కెమికల్స్ విడుదల చేయడానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా రక్తహీనతను నివారించడంలో, PMS లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుందని చెబుతున్నారు. బీన్స్, నట్స్​, కోడి గుడ్లు, ముడి పదార్థాలు, ఫోర్టిఫైడ్ సెరెల్స్, అవొకాడో, అరటిపండ్లు, మాంసాహారం, ఓట్ మీల్, డ్రైఫ్రూట్స్​లో ఈ విటమిన్ అధికంగా ఉంటుందని వివరిస్తున్నారు.

విటమిన్ B9: ఫోలిక్ యాసిడ్​గా పిలిచే బి9 విటమిన్ మహిళలందరికీ ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులకు న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి, శిశువు వెన్నెముక, మెదడును రక్షిస్తూ ప్రసవ ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని అంటున్నారు. అలాగే క్యాన్సర్, అధిక రక్త పోటు, డిప్రెషన్, మెమరీ లాస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుందని వివరిస్తున్నారు. ఈ విటమిన్ ఆకుకూరలు, బీన్స్​, పప్పుధాన్యాలు, గుడ్లు, నారింజ, అరటిపండ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు వంటి వాటిలో ఉంటుందని తెలిపారు.

విటమిన్ B12: ఇది ఎర్ర రక్త కణాలను, మెటబాలిజం రేటును పెంచడానికి, కణవిభజనకు, ప్రొటీన్ సింథసిస్​కు సహాయపడుతుందని నిపుణలు అంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే రక్తహీనతను నివారిస్తుందని చెబుతున్నారు. గర్భధారణ, పుట్టుకకు సంబంధించిన ప్రధాన పునరుత్పత్తి సమస్యల నివారణకు ఈ విటమిన్ సహాయ పడుతుందని చెబుతున్నారు. చేపలు, డైరీ ప్రొడక్ట్స్, మాంసాహారాలు, గుడ్డులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుందని వివరిస్తున్నారు. 2018లో Journal of Nutritionలో ప్రచురితమైన "Vitamin B12 content of animal products" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

విటమిన్ సి: ఇమ్యూన్ బూస్టర్​గా పిలిచే విటమిన్ C.. మహిళలకు చాలా ఉపయోగకరమైనదని నిపుణులు అంటున్నారు. ఇది రొమ్ము క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ, పాలిచ్చే తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. అలాగే బ్లడ్ సెల్స్ ఉత్పత్తిలో ముఖ్య పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ విటమిన్ కోసం బ్రొకోలీ, గ్రేప్ ఫ్రూట్, కివి, ఆరెంజ్, పొటాటో, స్ట్రాబెర్రీస్, టమాటాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

విటమిన్ డి: ఇది గర్భిణీల్లో ప్రసూతి రక్తపోటు, ముందస్తు ప్రసవాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంకా కాల్షియం, రోగనిరోధక వ్యవస్థను పెంచుతుందని చెబుతున్నారు. హార్మోన్లను సమతుల్యం చేయడమే కాకుండా.. పునరుత్పత్తి వ్యవస్థ సమర్థంగా పనిచేయడానికి సహాయపడుతుందని వెల్లడిస్తున్నారు. దీనిని పుట్టగొడుగులు, గుడ్లు, చేపలను తినడంతో పాటు సూర్యరశ్మి నుంచి కూడా పొందవచ్చని వివరిస్తున్నారు.

విటమిన్ ఇ: రోగనిరోధక శక్తి, చర్మం, కంటి ఆరోగ్యాన్ని పెంచేందుకు విటమిన్ ఇ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా పునరుత్పత్తి, గుండె ఆరోగ్యం మెరుగపడడానికి, హార్మోన్ల సమతుల్యతకు కూడా విటమిన్ ఇ అవసరం ఉంటుందని చెబుతున్నారు. వేరుశనగ, బాదం, అవకాడో, పాలకూర, కివి, చేపలు, గుడ్లలో ఇది పుష్కలంగా లభిస్తుందని తెలిపారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా? అసలు డయాబెటిస్ ఎందుకు వ్యాపిస్తుంది?

మొటిమలు, ముడతలు పోవాలా? గుడ్డును ఇలా పెడితే సో బ్యూటీఫుల్!

ABOUT THE AUTHOR

...view details