Avoid These Foods to Reduce Osteoporosis:ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మన శరీరం కూడా బలంగా ఉంటుంది. ఎముకలు బలహీనమై పెళుసుగా మారిపోతే మాత్రం.. చిన్న చిన్న కుదుపులు, దెబ్బలకు సైతం చిటుక్కున విరిగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఆస్టియోపోరోసిస్" బారినపడ్డప్పుడు ఎముకలు ఇలాగే మెత్తగా పెళుసుబారిపోతాయట.
ఈ సమస్య వయసు పైబడిన వారిలో, మెనోపాజ్ దాటిన మహిళలలో అధికంగా ఉంటుందట. అయితే వీరికి మాత్రమే కాకుండా మన నిత్య జీవితంలో తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు తినేవారికి.. చిన్న వయసులోనే ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉప్పు: మనం తినే ఆహారం ఏదైనా సరే రుచిగా ఉండాలని ఉప్పు వేసుకుంటుంటాం. ఉప్పు కావాల్సిన మేర ఉంటే ఏమీ కాదు. కానీ అదే ఉప్పు ఎక్కువైతే విషపూరితమవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడి, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే సోడియం, ఎముకల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపడంతో ఎముకలు బలహీనపడతాయని.. తద్వారా పెళుసుగా మారి విరిగిపోతాయని చెబుతున్నారు.
డ్రింక్స్: సోడా, కూల్డ్రింక్స్ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకున్నా ఎముకలు త్వరగా విరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఫాస్ఫరస్.. కాల్షియంను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. ఫలితంగా ఎముకలు త్వరగా విరిగే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అలాగే చక్కెర అధికంగా ఉండే స్వీట్లు కూడా ఎక్కువగా తీసుకోకూడదని.. షుగర్ ఎక్కువగా తింటే ఎముకలలో కాల్షియం తగ్గి.. బలహీనంగా మారతాయని అంటున్నారు.
కెఫెన్: కాఫీ, టీ సహా కొన్ని పానీయాలలో కెఫెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని కెఫెన్ ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి కాఫీ , టీ లకి కూడా దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండడం మంచిదని.. బర్గర్ , పిజ్జాతో పాటు ఇతర ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా పెళుసుబారిపోతాయని తద్వారా బోన్స్ సులభంగా విరగడానికి దోహదపడతాయంటున్నారు.