3 Habits for Healthy Lifestyle:ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంతసేపు వ్యాయామం చేయాలి? రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి? అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలా చాలా మందిలో ఆరోగ్యం గురించిన సందేహాలు ఉంటాయి. అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క ఆహారంతోనో, వ్యాయామంతోనో సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం క్రమం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించడం మేలని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజును ఇలా ప్రారంభిద్దాం!
మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే మనం తీసుకునే తొలి ఆహారమే కీలకమని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఈ సమయంలో శరీరానికి శక్తినిచ్చే పదార్థాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పండ్లు, నట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇంకా రోజూ ఉదయాన్నే ఏదైనా ఒక పండు, ముందు రోజు రాత్రంతా నానబెట్టిన కొన్ని బాదం పప్పులు/కిస్‌మిస్‌లను రెండు కుంకుమ పువ్వు రేకలతో కలిపి తీసుకోవాలంటున్నారు. ఇలా తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండచ్చని సలహా ఇస్తున్నారు.
మొదటి ముద్ద నెయ్యితోనే!
నెయ్యి తింటే లావు అవుతాం అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ రోజూ మూడు పూటలా మనం తీసుకునే భోజనంలో టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. నెయ్యిలో ఎ, డి, ఇ, కె వంటి కొవ్వును కరిగించే విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు. 2020లో Journal of Food Science and Technologyలో ప్రచురితమైన "Ghee: A Review of Its Nutritional and Pharmacological Properties"అధ్యయనంలోనూ తేలింది. అలాగే సీజనల్ పండ్లు, తృణధాన్యాల్ని ఆహారంలో తప్పనిసరి చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇక రాత్రి 8 లోపే డిన్నర్ ముగించడం ఆరోగ్యకరమైన అలవాటని వివరిస్తున్నారు.