Epilepsy Symptoms and Precautions: పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మూర్ఛ వ్యాధి చాలా మందిని వేధిస్తుంది. మెదడు నరాలకు సంబంధించిన ఈ వ్యాధిని ఫిట్స్, ఎపిలెప్సీ అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దీర్ఘకాలిక రుగ్మతగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు. అయితే, మనలో చాలా మంది మూర్ఛ వచ్చిన వ్యక్తికి వెంటనే తాళాలు చేతిలో పెట్టడం, ఇనుప వస్తువులు మెడలో వేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే నీటిని కూడా మీద పోస్తారు. కానీ ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకూడదని.. అది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎవరికైనా అకస్మాత్తుగా ఫిట్స్ వస్తే ప్రథమ చికిత్స ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు వస్తుంది?: మెదడుకు గాయం, మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల ఫిట్స్ వస్తుందని ప్రముఖ న్యూరాలజీ నిపుణులు డాక్టర్ పీ. రంగనాథం చెబుతున్నారు. మందులు సరిగ్గా వాడని వారిలోనూ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇవే కాకుండా ఇతర కారణాలు ఉంటాయని.. వాటిని తెలుసుకునేందుకు MRI పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రథమ చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఎవరైనా మూర్ఛతో పడిపోతే వారికి గాయాలు కాకుండా చూసుకోవాలి.
- ముఖ్యంగా చుట్టు పక్కల ఉన్న ప్రమాదకర వస్తువులను తీసివేయాలి.
- తల కింద కాస్త ఎత్తుగా ఏదైనా పెట్టి.. తగినంత గాలి ఆడేలా చూడాలి.
- ఫిట్స్ సమయంలో వచ్చే వాంతిని మింగకుండా ఉండేలా పక్కకు తిప్పి పడుకోబెట్టాలి.
- బలవంతంగా నీళ్లను తాగించడం, నోట్లోకి నీరు పోయడం ప్రమాదకరమే.
- ఫిట్స్ వచ్చిన వ్యక్తి నెత్తిపై నీరు పోయడం, చీపుర్లలో కొట్టకూడదు.
- మూర్ఛ తగ్గేదాకా ఆ వ్యక్తి కదలికలను గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాతే తినడానికి, తాగడానికి ఏమైనా ఇవ్వాలి.
- ఎట్టి పరిస్థితిలో కూడా మూర్ఛను ఆపేందుకు ప్రయత్నించొద్దు.
- పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- పోషకాహారాలను అధికంగా తీసుకోవాలి.
- శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి.
- వ్యాయామం చేయాలి. ప్రెజర్‌ను తట్టుకోవాలి.
- ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
- డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కండల కోసం జిమ్‌లో ఇచ్చే ప్రోటీన్ పౌడర్లు వాడుతున్నారా? సిక్స్ ప్యాక్ ఏమో కానీ ఆస్పత్రి పాలవడం పక్కా!
చలికాలంలో షుగర్ పేషెంట్లు జాగ్రత్త! ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవట!