Sankashtahara Chaturthi December 2024 : సంకష్ట చతుర్థి ఏర్పడే వారాన్ని అనుసరించి పేరు మారుతుంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం బుధవారాన్ని సౌమ్య వారమని కూడా అంటారు. బుధవారం సంకష్ట చతుర్థి ఏర్పడితే అది చాలా విశేషమని పండితులు చెబుతారు. ఇంతటి విశిష్టమైన సౌమ్య సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల వ్యాపార వృద్ధి, విద్యార్థులకు జ్ఞానం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. అంతేకాకుండా చేసే పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయి. డిసెంబర్ 18వ తేదీ బుధవారం సౌమ్య సంకష్ట చతుర్థి సందర్భంగా ఈ వ్రతం ఎలా జరుపుకోవాలి? వ్రత కథ గురించి తెలుసుకుందాం.
సంకటహర చతుర్థి వ్రత విధానం
సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు, అయిదు, తొమ్మిది, పదకొండు లేదా 21 నెలలపాటు ఆచరించాల్సి ఉంటుంది. ఈ వ్రతం చేసే రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పసుపుకుంకుమలతో అలంకరించిన పీట మీద గణేశుని ప్రతిమను ఉంచి ముందుగా షోడశ నామాలతో గణపతిని పూజించాలి.
విఘ్నేశ్వర బియ్యం ఇలా కట్టాలి
ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దానికి పసుపు కుంకుమలు పెట్టి అందులో మూడు గుప్పిళ్ల బియ్యాన్ని పోసి, ఒక తమలపాకులో 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపుకొమ్ములు, 5 వక్కలు ఉంచి 11 రూపాయలు దక్షిణ ఉంచి మనసులోని కోరికను గణపతికి చెప్పుకొని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి.
ముడుపు మూట ఇలా!
ముడుపు మూటను గణపతి ముందు ఉంచి ధూప దీపాలతో వినాయకుని పూజించి కొబ్బరికాయలు, అరటిపండ్లు సమర్పించాలి.
సాయంత్రం పూజ
సంకటహర గణపతి పూజ సాధారణంగా సూర్యాస్తమయం తర్వాతనే చేస్తారు. ఏ రోజైతే చవితి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందో ఆ రోజే సంకష్టహర చవితి జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. సంకష్ట గణపతి వ్రతం చేసేవారు సాయంత్రం వేళలో వినాయకుని ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయాలి. వినాయకుడికి గరిక సమర్పించాలి. శక్తి ఉన్నవారు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిది. లేని పక్షంలో వినాయకునికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవచ్చు.
ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు
ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే సూర్యాస్తమయం తర్వాత విఘ్నేశ్వరుని పంచామృతాలతో అభిషేకించి, అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చించి కొబ్బరి కాయలు, పండ్లు, ఉండ్రాళ్లు, మోదకాలు, పులిహోర నైవేద్యంగా గణపతికి సమర్పించాలి. సంకష్ట గణపతి వ్రత కథ చదువుకొని పూజాక్షితలను శిరస్సున వేసుకోవాలి. రాత్రి చంద్ర దర్శనం తర్వాత స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా ఎన్ని నెలలు వీలైతే అన్ని నెలలు చేసుకోవచ్చు.
సౌమ్య సంకష్టహర చతుర్థి వ్రత ఫలం
ముఖ్యంగా సంకష్టహర చతుర్థి ఈ సారి బుధవారం రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజు గణపతిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తే చేపట్టిన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని, ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు జోరందుకుంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా చదువులో బాగా రాణించి గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు.
రానున్న సౌమ్య సంకష్ట చవితి రోజు మనం కూడా గణపతిని ఆరాధిద్దాం సకల శుభాలను పొందుదాం.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.