How to Apply for Intercaste Marriage Incentive Award: నేటి జనరేషన్లో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణమయ్యాయి. స్వచ్ఛమైన ప్రేమకు.. కులాలు, మతాలు అడ్డురావని నిరూపిస్తూ చాలా మంది యువత కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. అయితే.. ఇలా కులాంతర వివాహం చేసుకునే వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. మరి ఆ స్కీమ్ ఏంటి? అర్హతలు? ఎలా అప్లై చేసుకోవాలి? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ ప్రభుత్వం "ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్"ను అమలు చేస్తోంది. సమాజంలో అంటరానితనాన్ని తగ్గించడానికి, కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెట్టింది.
ఈ పథకం ప్రయోజనాలు:
- ఈ పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఏకకాలంలో రూ.2.50లక్షల ఆర్థిక సాయాన్ని అందుకుంటారు.
- ఈ స్కీమ్ కులాంతర వివాహాలకు చట్టపరమైన చెల్లుబాటును అందిస్తుంది.
- కులాంతర వివాహానికి సంబంధించిన చట్టపరమైన రుజువుతో.. జంటలు వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు.
అర్హతలు:
- అమ్మాయి, అబ్బాయి తెలంగాణ వాసులై ఉండాలి.
- అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయసు పూర్తై ఉండాలి.
- ఒక భాగస్వామి షెడ్యూల్డ్ కులానికి(SC) సంబంధించినవారై, మరొకరు ఇతర కులానికి చెందిన వారై ఉండాలి.
- ఈ పథకానికి అప్లై చేసుకునే వారు 2019, అక్టోబర్ 30 తర్వాత కులాంతర వివాహం చేసుకుని ఉండాలి. వారికి మాత్రమే రూ.2.5లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ ఈ తేదీకన్నా ముందు చేసుకున్న వారికి 50 వేలు మాత్రమే అందుతుంది. వాళ్లు జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
- అమ్మాయి, అబ్బాయి మొదటి పెళ్లికే ఈ స్కీమ్ వర్తిస్తుంది. రెండు, మూడు పెళ్లిళ్లకు ఈ పథకం వర్తించదు. అలాగే వివాహమైన ఏడాది లోపే దరఖాస్తు చేసుకోవాలి.
అవసరమైన పత్రాలు:
- అమ్మాయి, అబ్బాయి ఆధార్ కార్డు
- ఇద్దరూ కలిపి తీసుకున్న జాయింట్ బ్యాంకు ఖాతా
- ఇద్దరి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
- వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫొటోలు
- శాశ్వత, తాత్కాళిక అడ్రస్ ప్రూఫ్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
- ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డ్‌లు
దరఖాస్తు విధానం: వధూవరులు తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం..
- ముందుగా https://telanganaepass.cgg.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- కిందకు స్క్రోల్ చేసి Marriage Incentive Awards ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం Inter caste Marriage Incentive Award (SC Development)లో కుడి వైపున ఉన్న Application Registration ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో వధువు, వరుడుకు సంబంధించిన పర్సనల్ వివరాలు, పర్మినెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల వివరాలు, సాక్షుల వివరాలు, పెళ్లి జరిగిన తేదీ, ప్లేస్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వివరాలు, దంపతుల జాయింట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్ని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత కావాల్సిన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- ఎంటర్ చేసిన వివరాలన్నీ మరొకసారి సరిచూసి Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఓ రిసిప్ట్ వస్తుంది. దానిని ప్రింట్ తీసి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇలా చేస్తే మీ దరఖాస్తు పూర్తైనట్లు.
స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా: ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు అప్లై చేసుకున్న వారు మీ అప్లికేషన్ స్టేటస్‌ను వెరిఫై చేసుకోవచ్చు. అందుకోసం..
- ముందుగా https://telanganaepass.cgg.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత Marriage Incentive Awards ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం Inter caste Marriage Incentive Awardలో కుడి వైపున ఉన్న Application Print/Status ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ తర్వాత మీకు అప్లై చేసే సమయంలో మ్యారేజ్ ఐడీ ఇస్తారు. దానిని ఎంటర్ చేయాలి. అది లేకపోతే వధువు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get Statusపై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది.
రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.5లక్షలు - అద్దిరిపోయే స్కీమ్ - మీకు తెలుసా?
రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు - చేతికి రూ.11 కోట్లు - ఈ బెస్ట్ పిల్లల స్కీమ్ గురించి మీకు తెలుసా?