Pushpa 2 Sandhya Theatre Incident : కిమ్స్ ఆసుపత్రిలో సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని సీవీ ఆనంద్ పరామర్శించారు. 13 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. బాలుడిని పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
సంధ్య థియేటర్ ఘటన జరిగి రెండు వారాలు అవుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ విచ్చేశామని చెప్పారు. రెండు వారాలు నుంచి తీవ్రంగా గాయపడిన చిన్నారికి చికిత్స కొనసాగుతోందన్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారో అనే విషయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను డాక్టర్లు విడుదల చేస్తారని సీవీ ఆనంద్ అన్నారు. ఆరోజు జరిగిన తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక మెదడు దెబ్బతిందని వెల్లడించారు. దీంతో బాలుడు రికవరీ కావడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారని చెప్పారు. వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ను సాగిస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలియజేశారు.
"తొక్కిసలాటలో శ్రీతేజ్ మెదడు దెబ్బతింది. ప్రస్తుతం శ్రీతేజ్ వెంటిలేటర్‌పై ఉన్నాడు. శ్రీతేజ్ కోలుకోవడానికి సమయం పడుతుంది. శ్రీతేజ్ ఆరోగ్యంపై త్వరలోనే బులెటెన్ విడుదల చేస్తారు." - సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు : మరోవైపు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై థియేటర్ యాజమాన్యాన్ని వివరణ కోరారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో సూచించారు.
అసలేం జరిగింది : ఈనెల 4వ తేదీన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోను చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కుటుంబం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లింది. అక్కడకు రాత్రి 9.30 గంటల సమయంలో సినిమాను చూసేందుకు సినీ హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చాడు. దీంతో తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అక్కడ ఉన్న అభిమానులను చెదరగొట్టారు.
ఈ సమయంలో అక్కడే ఉన్న దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఫ్యామిలీలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనాల కాళ్ల మధ్యలో పడిపోయి నలిగిపోయారు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లిపోయారు. వెంటనే తల్లీకుమారుడులను అక్కడే ఉన్న పోలీసులు సీపీఆర్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా.. కుమారుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని కిమ్స్ ఆసుపత్రికి పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యం : తొక్కిసలాట కేసు నేపథ్యంలో ఈనెల 12వ తేదీన అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన అత్యవసర పిటిషన్‌గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. బెయిల్ ఆర్డర్లు జైలు అధికారికి చేరేసరికి రాత్రి సమయం పట్టడంతో మరుసటి రోజు 13వ తేదీన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్‌కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి