6-6-6 Walking Rule:నడకతో గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పోలండ్ మెడికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిపై చేపట్టిన అధ్యయనంలోనూ ఈ విషయం మరోసారి బయటపడింది. ఇదే కాక మరెన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలూ ఉన్నాయని తేల్చింది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. రోజావారీ పనుల నిమిత్తం మనం వేసే అడుగులకు మరో వెయ్యి అడుగులు వేసినా... గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 15 శాతం తగ్గుతుందని తెలిపారు. అలాగే ఉదయం లేదా సాయంత్రం 4వేల అడుగులు నడవగలిగితే గుండె సంబంధిత అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు. అందుకే సమయం ఉన్నప్పుడు నడకను రోజువారీ వ్యాయామంగా మార్చుకోగలగాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాకింగ్ అలవాటు కావడానికి సులభమైన విధానాన్ని చెబుతున్నారు నిపుణులు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే, వాకింగ్పై ఆసక్తి లేనివాళ్లు దీన్ని ఓ ప్రణాళికగా మార్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు 6-6-6 సూత్రాన్ని పాటించి చూడాలని సలహా ఇస్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం రోజూ 6 గంటలకు అని సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా నడవడానికి ముందుగా 6 నిమిషాలు వార్మప్ చేయాలని.. ఆ తర్వాత గంటపాటు నడవాలనే నియమాన్ని పెట్టుకోవాలని వెల్లడించారు. ఇది పూర్తైన తర్వాత మరో 6 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వివరించారు. ఇలా చేయడం వల్ల హృదయ స్పందన తిరిగి పూర్వపుస్థితికి వస్తుందని తెలిపారు. అలా అని ఈ నియమం మేరకు గంట నడకను ఒకేసారి పూర్తిచేయాల్సిన అవసరం కూడా లేదని.. వీలునుబట్టి రోజులో అరగంట చొప్పున రెండుసార్లుగానూ చేయొచ్చని అంటున్నారు.
ప్రయోజనాలు
ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ద హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన పరిశోధకుల నివేదిక చెబుతోంది. జీవక్రియలు మెరుగ్గా జరగడంతోపాటు ఉదయంపూట స్వచ్ఛమైన గాలిని పీల్చడంతో శరీరానికి శక్తి పెరుగుతుందని అంటున్నారు. మానసికంగానూ ఉత్సాహంగా ఉండి రోజును సంతోషంగా ప్రారంభించగలమని వివరించారు. ఇక సాయంత్రపు నడక అయితే రోజంతా పనితో ఒత్తిడికి గురైన మన మెదడు రిలాక్స్ అవుతుందని.. ఫలితంగా రాత్రి కంటినిండా నిద్రపోయేలా చేస్తుందని అంటున్నారు.