తెలంగాణ

telangana

ETV Bharat / health

హెచ్చరిక: మీ దగ్గు క్షయవ్యాధి కావచ్చు! - చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమైన ముప్పు - ఈ లక్షణాలు తెలుసుకోండి - Warning Signs of Tuberculosis

Tuberculosis Symptoms : క్షయ.. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటున్న ప్రమాదకరమైన జబ్బు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరి వ్యాపించే ఈ మహమ్మారిని ముందుగానే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తిస్తే ఈజీగా నివారించవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tuberculosis Warning Signs
Tuberculosis Symptoms (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 5:14 PM IST

Tuberculosis Warning Signs :కొన్ని వ్యాధులు దీర్ఘకాలం పాటు వేధిస్తాయి. అలాంటిదే.. క్షయ లేదా టీబీ. ట్యుబర్​క్యులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఈ అంటువ్యాధి ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత క్రమంగా శరీరంలోని అన్ని భాగాలకూ చేరి ప్రాణాంతక సమస్యగా మారే అవకాశాలూ ఉన్నాయి. అంతేకాదు.. టీబీ ఎప్పుడైనా, ఎవరికైనా గాలి ద్వారా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి.. క్షయ విషయంలో నివారణే ప్రథమ కర్తవ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో.. అసలుటీబీ(Tuberculosis)వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? చికిత్స విధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లక్షణాలు :

టీబీ ఇన్​ఫెక్షన్ అనేది మూడు దశలలో ఉంటుంది. ఒక్కో దశలో ఒక్కో విధంగా లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ నళిని. అవేంటంటే..

ప్రైమరీ TB ఇన్​ఫెక్షన్ : ఈ దశలో బ్యాక్టీరియా మన ఊపిరితిత్తులలో ప్రవేశించి, ఒక చిన్న గుళికను ఏర్పరుస్తుంది. బాడీలోని రోగ నిరోధక వ్యవస్థ ఆ బ్యాక్టీరియాను చుట్టుముట్టి.. అది మరింత వ్యాపించకుండా అడ్డుకుంటుంది. అందుకే.. చాలా మందికి ప్రైమరీ టీబీ ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ, కొందరిలో తక్కువ జ్వరం, దగ్గు, అలసట వంటి లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉంటుందంటున్నారు డాక్టర్ నళిని.

లాటెంట్ TB ఇన్​ఫెక్షన్ :ఈ దశలోనూ మన బాడీలోని రోగనిరోధక వ్యవస్థ టీబీ బ్యాక్టీరియాను చుట్టుముట్టి అది మరింత వ్యాపించకుండా అడ్డుకుంటుంది. కానీ, బ్యాక్టీరియా పూర్తిగా నశించదనే విషయాన్ని గుర్తంచుకోవాలి. అంటే.. ఒక రకంగా ఈ స్టేజ్​లో బ్యాక్టీరియా "నిద్రిస్తున్న" స్థితిలో ఉంటుందని చెప్పుకోవచ్చు.

యాక్టివ్ TB డిసీజ్ : బాడీలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్​ఫెక్షన్​ను అడ్డుకోలేనప్పుడు అది బలంగా మారి "యాక్టివ్ TB డిసీజ్"​గా మారుతుంది. ఈ దశలో సూక్ష్మజీవులు ఊపిరితిత్తులు లేదా శరీరంలోని ఇతర భాగాలలో వ్యాధిని కలిగిస్తాయి. అంతేకాదు.. ఈ దశలో టీబీ లక్షణాలు(Mayo Clinic రిపోర్టు)క్రమంగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. కొన్ని వారాలలో తీవ్రమవుతాయి. ఆ లక్షణాల విషయానికొస్తే..

  • దగ్గు
  • రక్తం లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు
  • ఛాతి నొప్పి
  • శ్వాస లేదా దగ్గుతో నొప్పి
  • జ్వరం
  • చలి
  • రాత్రి చెమటలు
  • బరువు తగ్గడం
  • ఆకలి లేకపోవడం
  • అలసట.

క్షయ విషయంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే.. టీబీ అనేది కేవలం ఊపిరితిత్తులను మాత్రమే కాదు శరీరంలోని ప్రతి భాగంపైనా ప్రభావం చూపగలదు. అంటే.. ఊపితిత్తులకు సంబంధించినదైతే పల్మనరీ ట్యూబర్​కులోసిస్ అంటాం. అలాకాకుండా.. మిగతా భాగాలలో వస్తే దాన్ని "ఎక్స్​ట్రా పల్మనరీ ట్యూబర్​కులోసిస్"గా చెప్పుకుంటాం. కాబట్టి.. శరీరంలోని ఏ భాగానికి ఇన్​ఫెక్షన్ సోకిందనే దానిపై ఆధారపడి లక్షణాలు మారుతూ ఉంటాయంటున్నారు డాక్టర్ నళిని.

సాధారణ లక్షణాలు వచ్చేసరికి..

  • జ్వరం
  • చలి
  • రాత్రి చెమటలు
  • బరువు తగ్గడం
  • ఆకలి లేకపోవడం
  • అలసట

ఊపిరితిత్తులు కాకుండా TB సోకే అవయవాలు :

  • కిడ్నీలు
  • కాలేయం
  • మెదడు, వెన్నుపాము
  • గుండె కండరాలు
  • జననేంద్రియాలు
  • శోషరస కణుపులు
  • ఎముకలు, కీళ్లు
  • చర్మం
  • రక్త నాళాల గోడలు
  • స్వరపేటిక

అయితే.. పిల్లలలో TB లక్షణాలు వయసు ప్రకారం మారుతూ ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ నళిని.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?

క్షయవ్యాధి లక్షణాలు అనేక రకాల వ్యాధుల లక్షణాలను పోలి ఉంటాయి. అలాకాకుండా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా, మందులు వాడినా పైన పేర్కొన్న లక్షణాలు తగ్గకపోతే.. మీరు వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిదంటున్నారు. ముఖ్యంగా.. ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి, గందరగోళం, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంతో కూడిన దగ్గు, యూరిన్​లో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే డాక్టర్​ దగ్గరకు వెళ్లాలని సూచిస్తున్నారు.

చికిత్స విధానం :

మీకు టీబీ ఉన్నట్లు తెలితే వెంటనే వైద్యులు సూచించిన మందులు వాడుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్ నళిని. చాలా వరకు ప్రాథమిక దశలో టీబీని గుర్తించి వైద్యులు సూచించిన మందులు, జాగ్రత్తలు ఫాలో అవుతూ తగిన చికిత్స తీసుకుంటే.. నాలుగు, ఆరు లేదా తొమ్మిది నెలలలోనే టీబీని నయం చేసుకోవచ్చట! అదేవిధంగా జబ్బు నయమవుతుందో.. లేదో.. తెలుసుకోవడానికి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి సంబంధిత డాక్టర్​ను రెగ్యులర్​గా​ సంప్రదిస్తుండాలి. ఇలా చేయడం ద్వారా.. టీబీ నుంచి వేగంగా కోలుకోవచ్చంటున్నారు. అలాగే.. పౌష్టికాహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం చేయాలంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

TB తగ్గాక మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

క్షయ తగ్గినా.. దగ్గు, కళ్లె పడుతుందా? కారణాలివే..!

ABOUT THE AUTHOR

...view details