How To Remove Smell From Kitchen :వంటగది అనేది విభిన్న పదార్థాలకు నిలయం. రకరకాల ఆహారాలను తయారు చేసుకోవడం కోసం చాలా రకాల వస్తువులను తెచ్చి పెట్టుకుంటారు. అయితే ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ వేర్వేరు ఆహార పదార్థాల కలయిక కారణంగా కిచెన్ అంతా అదో రకమైన వాసన వస్తుంది. ఇది కొన్నిసార్లు అసహ్యకరంగా మారి ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు మార్కెట్ నుంచి తెచ్చుకున్న రూం స్ప్రేలు తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. స్ప్రే ప్రభావం తగ్గిన వెంటనే మళ్లీ కిచెన్‌లో వాసన వస్తుంటుంది. మరి దీనికి శాశ్వత పరిష్కారం అంటూ లేదా? అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు.
మసాలా దినుసులు:
వంటగదిలోని దుర్వాసనను పొగొట్టేందుకు మసాలా దినుసులు ఉత్తమమైనవి. ఇందుకు మీరు దాల్చిన చెక్క, లవంగాలను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. అలా మరిగిన నీటి ఆవిరిని వంటగదంతా పొగ వేసినట్టుగా వేయాలి. ఇలా చేశారంటే దుర్వాసన పోయి గదంతా లవంగాలు, దాల్చినచెక్కతో కూడిన తాజా సువాసన వస్తుంది.
వెనిగర్ లేదా నిమ్మకాయ:
వెనిగర్ లేదా నిమ్మకాయలు కూడా వంటగదిలోని నీచు వాసనను పోగొట్టడంలో బాగా సహాయపడతాయి. ఇందుకు వెనిగర్ లేదా నిమ్మకాయను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. అలా మరిగిన నీటిని చల్లారిన తర్వాత స్ప్రే బాటిళ్లలో పోసుకుని రూం అంతా స్ప్రే చేయాలి. ఇది సహజమైన రూం ఫ్రెషనర్‌లా గదిని తాజా సువాసనతో నింపుతుంది.
వెంటిలేషన్:
కిచెన్‌లో దుర్వాసన రాకుండా ఉండాలంటే దాంట్లోని గాలి, వెలుతురు వెళ్లడం చాలా ముఖ్యం. సహజమైన కాంతి అందకపోవడం వల్ల కూడా గదిలో దుర్వాసనకు కారణం అవుతుంది. కనుక వంటగది కిటికీలను వీలైనంత వరకు తెరిచే ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాసన కిటికీలు, చిమ్నీల ద్వారా బయటకుపోయి దుర్వాసన రాకుండా ఉంటుంది.