Fertility Boosting Lifestyle Habits : ఈ ఆధునిక యుగంలో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటితోపాటు సంతానలేమి కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రకాల కారణాలతో.. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరి.. ఈ పరిస్థితి ఎందుకు పెరుగుతోంది అంటే.. మన జీవనశైలి, అలవాట్లే కారణమని బల్లగుద్ది చెబుతున్నారు నిపుణులు! ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపరచుకోవాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
ధూమపానం, డ్రగ్స్ :ఈ రెండు సంతానం సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆడవాళ్లు ఇవి తీసుకుంటే.. ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందట. ఎంతగా అంటే.. వీరికి బిడ్డ పుట్టిన తర్వాత.. ఆ బిడ్డ ఎదిగి పెళ్లైన తర్వాత సంతానోత్పత్తిని కూడా ఎఫెక్ట్ చేస్తుందట! కాబట్టి మీ ఫెర్టిలిటీ(Fertility) సామర్థ్యం మెరుగుపడాలంటే ఈ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు.
మద్యపానం :ఆల్కహాల్ సేవించడం శరీరానికి ఎన్నో విధాల నష్టం చేకూరుస్తుంది. అలాగే ఇది సంతానోత్పత్తికీ అడ్డంకులు కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మద్యపానం తీసుకోవడం వల్ల పునరుత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గడమే కాకుండా ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశాన్ని తగ్గిస్తుందంట. మద్యపానం పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రభావాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.
అధిక బరువు : చురుకైన జీవనశైలిని కలిగి ఉండకపోవడం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలంటున్నారు. భార్యాభర్తల్లో ఒక్కరు బరువెక్కువున్నా కూడా గర్భం ధరించడం కష్టమవుతుందట. ఊబకాయం వల్ల ఏర్పడే హార్మోన్ల అసమతుల్యతతో గర్భం దాల్చడం సవాలుగా మారుతుందట. కాబట్టి హెల్దీ బరువు కోసం రెగ్యులర్గా వ్యాయామం చేయడం అలవాటును చేసుకోవాలని సూచిస్తున్నారు.