తెలంగాణ

telangana

ETV Bharat / health

మూత్రం క్లియర్​గా ఉన్నా సమస్యే - రంగు రంగుకో రోగం! - మీది ఏ కలర్​లో ఉంది? - Urine Color May Signal Health Risks

Warning Signs of Urine Color : ఒంట్లో ఎలాంటి రోగం ఉన్నా.. అది మూత్రంలో కనిపిస్తుందంటారు వైద్యులు! ప్రాణాంతక వ్యాధులను సైతం మూత్రం రంగు ద్వారా పసిగట్టొచ్చని చెబుతున్నారు. మరి.. యూరిన్​ ఎలాంటి రంగులో ఉంటే సురక్షితం..? ఏ కలర్​లో ఉంటే ప్రమాదకరం? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Urine Color
Urine

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 1:27 PM IST

Urine Color May Signal Health Risks :నార్మల్​గా విసర్జించే మూత్రం యూరోబిలిన్ పిగ్మెంట్ కారణంగా.. లేత పసుపు రంగులో ఉంటుంది. అయితే, యూరిన్ రంగు మనం తాగే నీరు బట్టి కూడా మారవచ్చు. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారాలు, వేసుకునే మందుల వల్ల కూడా మూత్రం రంగు మారుతుంది. కానీ.. నార్మల్ టైమ్​లో కూడా మీ మూత్రం మరొక రంగులోకి మారితే.. అప్రమత్తం కావాల్సిందే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. మరి.. ఏ రంగు మూత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రంగులేని మూత్రం :వైద్యుల అభిప్రాయం ప్రకారం.. స్పష్టంగా ఎలాంటి రంగూ లేకుండా నీళ్లలాగే మూత్రం వస్తుందంటే.. మీరు వాటర్ అతిగా తాగుతున్నారని అర్థమట. అంటే బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగినప్పుడు మీ కిడ్నీలు అదనపు నీటిని రంగులేని మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అప్పుడప్పుడు ఇలా వస్తే ఎలాంటి ఆందోళన లేదు కానీ.. ఎప్పుడూ ఇదే రంగులో వస్తే మీరు తాగే నీటిని తగ్గించుకోవాలట. నిజానికి నీరు తాగడం మంచిదే అయినప్పటికీ.. పరిమితికి మించి తాగడం వల్ల రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యతకు దారితీయవచ్చు. అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం.. రంగులేని మూత్రం సిర్రోసిస్, వైరల్ హెపటైటిస్ వంటి కాలేయ సమస్యలను కూడా సూచిస్తాయట.

ఎరుపు రంగు మూత్రం :బీట్‌రూట్, బ్లూబెర్రీస్ వంటివి మీరు క్రమం తప్పకుండా తింటే మీ మూత్రం తాత్కాలికంగా ఎరుపు లేదా గులాబీ రంగులో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాకాకుండా.. నార్మల్ టైమ్​లోనూ మీ మూత్రం రెడ్ కలర్​లో వస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు. యూరిన్​లో రక్తం లేదా హెమటూరియా వంటివి ఇందుకు కారణం కావచ్చు. లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా ఇది సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఎరుపు రంగులో వచ్చే యూరిన్ మూత్రపిండాల వ్యాధి లేదా క్యాన్సర్ సంకేతం కూడా కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ కలర్​లో యూరిన్ వస్తే వెంటనే అప్రమత్తం కావాలంటున్నారు.

మూత్రం బలవంతంగా ఆపుకుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

నారింజ రంగు మూత్రం : మీ మూత్రం నారింజ రంగులో ఉన్నట్లు మీరు గమనించినట్లయితే.. అది డీహైడ్రేషన్ లక్షణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఆ టైమ్​లో వెంటనే అప్రమత్తమై ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే, కొన్ని అధ్యయనాల ప్రకారం.. కాలేయానికి సంబంధించిన సమస్యల కారణంగా పిత్తం(బైల్) మీ రక్తప్రవాహంలోకి వచ్చినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే పెద్దల్లో వచ్చే కామెర్లు కూడా నారింజ రంగు మూత్రానికి కారణమవుతాయి.

ముదురు గోధుమ రంగు మూత్రం : మీ యూరిన్ ఈ రంగులో వస్తున్నా లైట్ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది మూత్రాశయం లేదా కిడ్నీ క్యాన్సర్​కు మొదటి సంకేతం కావొచ్చంటున్నారు. ఎక్కువగా ఈ రంగు మూత్రం తీవ్రమైన నిర్జలీకరణాన్ని సూచిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఈ రంగు మూత్రం కాలేయ వ్యాధిని కూడా సూచిస్తుంది. మీ మూత్రంలోకి పిత్తం రావడం వల్ల ఇది సంభవించవచ్చంటున్నారు నిపుణులు.

క్లౌడీ యూరిన్ : మీ మూత్రం ఇలా వచ్చినా వెంటనే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది అనేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు సంకేతం. అలాగే మూత్రాశయం ఇన్ఫెక్షన్ వల్ల లేదా అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల వల్ల కూడా ఇది జరుగుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు. చూశారుగా.. యూరిన్ రంగు మారితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో..? కాబట్టి మీ మూత్రం కలర్​లో కూడా ఈ విధమైన ఛేంజెస్ ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్రం దుర్వాసన వస్తోందా? - అయితే ఈ ప్రాణాంతక వ్యాధే కారణం కావొచ్చు!

ABOUT THE AUTHOR

...view details