Soak Mangoes Before Eating : మామిడిపండ్ల కోసం సమ్మర్ ఎప్పుడొస్తుందా అంటూ ఏడాదంతా ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారు. భారతీయులకు మామిడిపండ్ల మీద ఉండే ప్రేమ అలాంటిది. అయితే వీటి విషయంలో చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటిలో ఒకటి మామిడిపండ్లను తినడానికి ముందు కాసేపు నీళ్లలో వేయాలి. తెచ్చుకుని నేరుగా తినడం మంచిది కాదని కాసేపు నీళ్లలో నానిన తర్వాతే తినాలని పెద్దలు కూడా ఎప్పుడూ చెబుతుంటారు. దీనికి కారణమేంటి? నీటిలో వేసి తినడం వల్ల కలిగే లాభాలేంటి? వేయకుండా తినడం వల్ల కలిగే నష్టాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం.
ఫైటిక్ యాసిడ్
మామిడిపండ్లు లేదా కాయలను తినే ముందు నీళ్లలో పెట్టడం ఆరోగ్యానికి మంచిదట. ఎందుకంటే మామిడి పండు బయటి పొరలో ఫైటిక్ యాసిడ్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు గ్రహించే సహజ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మామిడి పండు తినడం వల్ల కలిగే పోషకాలకు అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాదు ఫైటిక్ యాసిడ్ కారణంగా మలబద్దకం, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
మందు అవశేషాలు
మామిడి పండ్లను పండించే ముందు పురుగుల మందులు వాడచ్చు. లేదా అవి చెట్టు మీద ఉండగానే దుమ్ము, ధూళి, మురికి లాంటివి వాటిపై పడచ్చు. ఇలా రకరకాలుగా కలుషితమైన మామిడి పండును కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల శుభ్రమవుతుంది. చక్కగా కడుక్కుని తినడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలు అందుతాయి.
మెత్తబడతాయి
మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో వేసి కాసేపు ఉంచడం వల్ల పండు చర్మం కాస్త మృదువుగా మెత్తగా మారే అవకాశాలున్నాయి. ఇలా చేయడం వల్ల మామిడిని తొక్క నుంచి వేరు చేయడం సులభం అవుతుంది. వంటకాల కోసం పచ్చళ్ల కోసం మామిడి పండ్లను ఉపయోగించడానికి ముందు కూడా నీళ్లలో కాసేపు ఉంచి తీయడం మంచిది.