Tips to Store Snacks and Groceries in Monsoon:వర్షాకాలం అంటే చాలా మందికి ఇష్టం. చిరుజల్లుల పులకరింతతో తడిసిముద్దవుతుంటారు. అయితే వర్షాకాలం వానలు మాత్రమే కాదు.. పలు రకాల సమస్యలను కూడా వెంటబెట్టకొస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో తడిదనం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంట గదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు, స్నాక్స్.. బూజు పట్టి పాడవుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని నిల్వ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి..
- అధిక నీటి వినియోగం, తడిదనం వల్ల వంటింట్లో వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. దీంతో క్రిములు, ఫంగస్.. వంటివి వృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి నిల్వ చేసే పదార్థాలు, నిత్యావసర సరుకుల్ని తేమ లేని చోట భద్రపరచాలని.. అలాగే తేమ చేరకుండా మధ్యమధ్యలో, కప్‌బోర్డ్ మూలల్లో సిలికాజెల్ ప్యాకెట్లను ఉంచాలని సూచిస్తున్నారు.
- పప్పులు, ధాన్యాలు, మసాలాలు.. వంటి ఫుడ్ ఐటమ్స్‌ని ఇంటికి తెచ్చాక బాగా ఎండబెట్టి స్టోర్ చేయడం కొంతమందికి అలవాటు. అయితే ఈ సీజన్‌లో వాతావరణంలోని తేమ ఆ పదార్థాల పైకి చేరి అవి మరింత మెత్తబడే అవకాశం ఉంటుందని.. ఫలితంగా అవి త్వరగా పాడవుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా వాటిని బాగా వేయించడం లేదా అవెన్‌లో వేడి చేసి చల్లారిన తర్వాత గాలి చొరబడని గాజు డబ్బాలలో భద్రపరచడం మంచిదని సూచిస్తున్నారు.
వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్‌బై చెప్పొచ్చు! - Fruits to Fight With Infections
- తేమకు ఉప్పు, పంచదార వంటి పదార్థాలు గట్టి పడతాయి. కాబట్టి ఈ రెండూ కలగలిసిన స్నాక్స్‌ని ఒకే జార్‌లో నిల్వ చేయకుండా విడివిడిగా భద్రపరచడం వల్ల రుచి కోల్పోకుండా, మెత్తబడకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు. అలాగే తినగా మిగిలిన చపాతీలు, వేపుళ్లను అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్ చేసి నిల్వ చేయడం వల్ల వాటి రుచి కోల్పోకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
- బయటి నుంచి కొని తెచ్చుకున్న స్నాక్స్ చాలా వరకు ప్యాకెట్లలో నిల్వ చేస్తారు. అయితే వీటిని ఒక్కసారి తెరిచాక.. వాటిని అలాగే వదిలేస్తే.. అవి మెత్తగా అయిపోతాయి. కొన్ని కొన్ని స్నాక్ ఐటమ్స్ బూజు పడతాయి కూడా. కాబట్టి స్నాక్స్ ఇంట్లో చేసినా, బయటి నుంచి కొని తెచ్చుకున్నా గాలి చొరబడని గాజు కంటైనర్లలో నిల్వ చేయడం మంచిదని చెబుతున్నారు.
- గోధుమ పిండి, శనగపిండి.. వంటి వాటికి తేమ తగిలితే పాడవుతాయి. కాబట్టి వాటిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిచి.. అందులో కొన్ని బిర్యానీ ఆకుల్ని వేయడం ద్వారా ఈ ఆకులు ఏ మాత్రం తేమ ఉన్నా పీల్చేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. 2021లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గాజు సీసాలో నిల్వ చేసిన గోధుమ పిండిలో బిర్యానీ ఆకులు వేసిన 6 నెలల తర్వాత కూడా తేమ లేకుండా తాజాగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) లో శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. బిర్యానీ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు గోధుమ పిండిలోని పోషకాలను కాపాడటానికి సహాయపడతాయని వారు పేర్కొన్నారు.