Side Effects of Controlling Urine for Long Time:చాలా మంది యూరిన్ వస్తున్నా.. టాయిలెట్‌కు వెళ్లకుండా అలానే ఉంటారు. పని మీద బయటకు వెళ్లినప్పుడు కావొచ్చు.. ఆఫీస్ పనిలో బీజీగా ఉండటం వల్ల కావొచ్చు.. మరేదైనా కారణం కావొచ్చు.. యూరిన్ విసర్జించాల్సిన అవసరం ఉన్నా.. బలవంతంగా ఆపుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా? అయితే.. తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు!
సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇక ఎంతసేపు మూత్రాన్ని ఆపితే.. బ్లాడర్ మీద అంత ఒత్తిడి పెరుగుతూ పోతుంది. అయితే.. ఇలా ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపితే అంతగా ఇబ్బంది ఉండదు. కానీ తరచూ ఇలా జరిగితే మాత్రం ఈ సమస్యలు రావడం పక్కా!
యూరిన్ ఇన్ఫెక్షన్:యూరిన్‌కు వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటే.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ-UTI) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బాక్టీరియా సహజంగా మూత్ర నాళంలో ఉండి.. మూత్రంతో విసర్జించబడుతుంది. మూత్రాన్ని ఆపుకున్నప్పుడు మూత్రాశయంలోనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అది ఇతర భాగాలకు పాకుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. యూటీఐలు చాలా బాధాకరమైనవి. ఈ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశముంది. ఈ సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే మరింత తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
మూత్రం ఆపలేని పరిస్థితి:ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి. ఎక్కువ సేపు ఆపుకోవడం అనే పరిస్థితి కొనసాగితే.. కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది మూత్రం ఆపుకోలేని స్థితికి దారితీస్తుంది. ఇది క్రమంగా మూత్రం లీకవటానికి దారితీస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఈ సమస్య వచ్చిన వారికి.. దగ్గినా, తుమ్మినా, నవ్వినా దుస్తుల్లోనే మూత్రం పడే అవకాశం ఉంటుంది.
నొప్పి కలుగుతుంది..:మూత్రాన్ని ఎక్కువసేపు ఆపితే అది నొప్పికి కారణమవుతుంది. ఎందుకంటే యూరిన్ ఆపడం వల్ల.. కండరాలు ఓవర్‌టైమ్ పనిచేయాలి. మూత్రాన్ని ఆపాలంటే కండరాలు బిగుతుగా మారిపోవాలి. ఈ పరిస్థితి ఎల్లవేళలా ఉంటే కండరాలు బలహీనంగా మారిపోతాయి. తద్వారా యూరిన్ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.