Metro Announced That Metrorail Hub At JBS : మెట్రోరైలు రెండో దశలో భాగంగా జేబీఎస్ వద్ద మెట్రోరైల్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైలు సంస్థ (హెచ్ఏఎంఎల్) వెల్లడించింది. మేడ్చల్, శామీర్‌పేట కారిడార్ల ప్రారంభ స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేసి ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించవచ్చని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎల్రెడ్డి తెలిపారు. ప్రతిపాదిత మార్గంతో మేడ్చల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 60కి.మీ సుదీర్ఘ మెట్రో కారిడార్ అవుతుందని వివరించారు.
సంక్లిష్ట అంశాలు ఏంటంటే : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మేడ్చల్, శామీర్‌పేట మెట్లో మార్గాలను రూపొందించే కసరత్తులను అధికారులు మొదలెట్టారు. ప్యారడైజ్-మేడ్చల్(23కి.మీ), జేబీఎస్-శామీర్‌పేట(22 కి.మీ) ప్రతిపాదిత కారిడార్ల అలైన్మెంట్ రూపొందించడంలో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక సలహాదార్లతో కలిసి హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు కారిడార్ల ఏర్పాటులో ఎదురవుతున్న కొన్ని సంక్లిష్ట అంశాలను గుర్తించారు.
పాటలు, డాన్స్, కవితలు ఇవన్నీ మీకు వచ్చా?- అయితే సూపర్ ఛాన్స్ ఇచ్చిన మెట్రో ఎండీ
- క్లిష్టమైన మలుపులు, బేగంపేట విమానాశ్రయం రన్‌వే తర్వాత భూగర్భంలో అలైన్‌మెంట్‌ను తీసుకుకెళ్లే ఆవశ్యకతను నివారించేలా, ప్రైవేటు ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాల లాభనష్టాలను అంచనా వేయాలని మెట్రో ఎండీ అధికారులకు సూచించారు.
- సొరంగం ద్వారా కాకుండా బోయిన్‌పల్లి రోడ్ (సరోజినీ పుల్లారెడ్డి బంగ్లా పక్కన) చివరన ఉన్న జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్‌మెంట్‌ను అనుసంధానించవచ్చని వివరించారు. అక్కడి నుంచి ఇప్పటికే విస్తరించిన జాతీయ రహదారి సర్వీస్ లేన్‌పై మెట్రో స్తంభాలను నిర్మించవచ్చని తెలిపారు. దీంతో మేడ్చల్ -జేబీస్-ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట-శంషాబాద్ విమానాశ్రయం వరకు 60 కి.మీ. సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటవుతుందని పేర్కొన్నారు.
- జేబీఎస్-శామీర్‌పేట మెట్రో మార్గం సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ప్రస్తుతమున్న మొదటి మెట్రో స్తంభం నుంచి డబుల్ ఎలివేటెడ్‌గా కరీంనగర్ రహదారిపై హెచ్‌ఎండీఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్‌గా నేరుగా పొడిగించవచ్చని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
- స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ, మెరుగైన పార్కింగ్, రక్షణ భూముల లభ్యత, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను గుర్తించాలని ఆదేశించారు.