TVK Vijay On Farmers Protest : అభివృద్ధికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని సినీనటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు. కానీ సారవంతమైన వ్యవసాయ భూముల్లో ఎయిర్ పోర్టు నిర్మించడం సరైనది కాదని అన్నారు. సహజ వనరుల రక్షణ తమ పార్టీ సూత్రమని తెలిపారు. తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పరందూరు పరిసర ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణాన్ని తామ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులు, స్థానికులకు సంఘీభావం తెలిపారు.
పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ పార్టీ న్యాయపోరాటం చేపట్టడానికి వెనుకాడదని తెలిపారు విజయ్. ఆ విషయంలో రైతులకు మద్దతు ఇస్తామని చెప్పారు. జల వనరుల నాశనం కారణంగా వరదలు సంభవించే ఉందని వ్యాఖ్యానించారు. 90 శాతం వ్యవసాయ భూములు నాశనం చేసి విమానాశ్రయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నందుకు డీఎంకేది ప్రజా వ్యతిరేక పాలనగా విజయ్ అభివర్ణించారు.
అప్పుడు టంగ్స్టన్ మైనింగ్‌ను వ్యతిరేకించిన డీఎంకే ప్రభుత్వం, ఇప్పుడు పరందూర్ విమానాశ్రయంపై అదే వైఖరి ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టులో స్టాలిన్ సర్కార్‌కు ఏదో లాభం ఉన్నట్లుందని ఆరోపించారు. ప్రజలు దానిని అర్థం చేసుకున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతు ఇచ్చిన డీఎంకే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వారిని వ్యతిరేకిస్తుందా అని స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే?
చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల ప్రత్యామ్నాయం కోసం నగర శివారులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. కాంచీపురం జిల్లా పరందూరు పరిసర ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం చేపట్టాలని నివేదికలు సిద్ధం చేశాయి. అనుమతులు పొంది మార్చిలోపు టెండర్లకు వెళ్లాలని చూస్తున్నాయి. అదే సమయంలో పచ్చగా ఉన్న గ్రామాల్ని నాశనం చేయవద్దంటూ అక్కడి స్థానికులు, రైతులు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ప్రాజెక్టుతో 13 గ్రామాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. అధికారుల అంచనాల ప్రకారం సుమారు 1000 ఇళ్లు పడగొట్టాల్సి వస్తుంది. ఒక్క ఏకనాపురం గ్రామంలోనే 600 ఇళ్లు పోయే ప్రమాదముంది. గ్రామంలోనే తొలిసారిగా నిరసనలు మొదలయ్యాయి. మిగిలిన గ్రామాలవారు కూడా పోరుకు సిద్ధమయ్యారు. చెరువులు, కుంటలు నాశనమవుతాయని, తమ భూములు పోతాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. రకరకాలుగా తమ నిరసన కొనసాగిస్తూ వస్తున్నారు. పాఠశాలలకు పిల్లల్ని పంపకపోవడం, ఎన్నికల బహిష్కరణ, రాస్తారోకోలు చేయడం లాంటివి కొనసాగిస్తున్నారు. అనేక రోజులుగా చేపడుతున్న ఆ నిరసనలతో పార్టీలు కూడా మద్దతిచ్చే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు విజయ్ కూడా మద్దతు తెలిపారు.
'విజయ్ పార్టీ సిద్ధాంతాలన్నీ కాపీ కొట్టినవే'- 'కొత్త వైన్ బాటిల్లో పాత మందే!'
పార్టీ జెండా ఆవిష్కరించిన తమిళ హీరో విజయ్- ఆ రెండు ఏనుగుల అర్థం అదేనా?