Birth Control Pill Benefits And Side Effects :కొత్తగా పెళ్లైన వారు, జీవితంలో స్థిరపడాలనుకునే వారు, అప్పుడే పిల్లలు వద్దనుకునే వారు, నెలసరి సమస్యలతో బాధపడే వారు గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా వాడితే భవిష్యత్తులో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు పెరుగుతామేమోనని, ఇలా ఈ మాత్రల గురించి కొంతమందిలో పలు అపోహలు, సందేహాలు ఉంటాయని చెబుతున్నారు. నేడు 'ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం' నేపథ్యంలో గర్భనిరోధక మాత్రలపై ఉండే కొన్ని అపోహలు, వాస్తవాలపై వైద్య నిపుణులేమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గర్భనిరోధక మాత్రలను ఎలా వాడాలి?: గర్భనిరోధక మాత్రల్లో చాలావరకూ కాంబినేషన్ పిల్స్‌గా దొరుకుతాయి. ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజెన్ లాంటి ప్రత్యుత్పత్తి హార్మోన్లు కలగలిసిన ఈ మాత్రలు రెండు రకాలుగా గర్భం ధరించకుండా అడ్డుపడతాయి. మొదటి రకం.. అండోత్పత్తి సమయంలో అండం విడుదల కాకుండా చేయడం. రెండో రకం.. గర్భాశయం చుట్టూ ఉండే శ్లేష్మాన్ని చిక్కగా చేసి తద్వారా వీర్యాన్ని గర్భాశయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఇలా రెండు రకాలుగా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని 21, 24, 28 రోజుల రుతుచక్రం ఉండే వారు రోజుకు ఒక్కటి చొప్పున ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుందని వైద్యలు సూచిస్తున్నారు. అయితే వీటిని ఎవరికి వారు సొంతంగా కాకుండా ముందుగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అది అపోహేనా? :తరచుగా ఈ మత్రలను వాడేవారు మధ్యమధ్యలో వేసుకోకపోతే పర్లేదా అంటే ఇది పూర్తిగా అపోహే అంటున్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ చందు శైలజ. ఎందుకంటే కాంట్రాసెప్టివ్ పిల్స్‌ని మధ్యమధ్యలో ఆపేయడం వల్ల అవాంఛిత గర్భధారణ జరగొచ్చని చెబుతున్నారు. అలాగే నెలసరితో సంబంధం లేకుండా స్పాటింగ్, బ్లీడింగ్ లాంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. అందుకనే మీకు తెలిసి తెలియకనో ఈ మాత్రల్ని మానేసినట్లయితే దానివల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి నిపుణుల్ని సంప్రదించాలంటున్నారు. వారి సలహా తీసుకోవడం మంచిదని తద్వారా అవాంఛిత గర్భాన్ని అడ్డుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
వీటిని ఎవరికి వారే కొనుక్కొని వేసేసుకోవచ్చా? : గర్భనిరోధక మాత్రలు వాడే ముందు ఆరోగ్యస్థితిని వైద్య నిపుణుల వద్ద పరీక్షలు చేపించుకోవాలని, వారి సలహా మేరకు మాత్రమే మాత్రలను వాడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, రక్తం గడ్డకట్టే సమస్య ఉన్న వారు, స్థూలకాయ సమస్యలు, ధూమపానం అలవాటున్న వారిలో ఇవి తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారికి ఈ మాత్రలు సరిపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు . అయితే కచ్చితంగా వాడాలంటే మాత్రం తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.