తెలంగాణ

telangana

ETV Bharat / health

మెసేజ్ రాగానే రిప్లై ఇస్తున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? స్క్రీన్ ఆప్నియా కారణాలేంటి? - SCREEN APNEA SYMPTOMS

-మీకు స్క్రీన్ ఆప్నియా గురించి తెలుసా? -ఈ సమస్యకు లక్షణాలు, పరిష్కారాలివే!

Screen Apnea Symptoms
Screen Apnea Symptoms (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 8, 2025, 12:26 PM IST

Screen Apnea Symptoms:మీరు పనిలో ఉండగా మెసేజ్ వస్తే వెంటనే రిప్లై ఇస్తున్నారా? ఇంతలోనే మరొకరు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నారా? మన పనిచేసుకుంటూనే వీటిని క్షణాల వ్యవధిలోనే చేసేస్తుంటారు. కానీ, ఈ క్రమంలోనే మనం శ్వాస తీసుకోవడం మర్చిపోతున్నామట. ఆన్‌లైన్‌లో పనిచేసుకుంటూ తెర మీదనే దృష్టి కేంద్రీకరించి, మన సెన్సెస్‌ను కోల్పోతున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే ఈ- మెయిల్‌ లేదా స్క్రీన్‌ ఆప్నియా అని పిలుస్తారని వివరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇలా తరచూ శ్వాస తీసుకోవడంలో విరామం రావడం వల్ల మనలో అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగిపోయి, వ్యాధినిరోధకతకు అవరోధం కలుగుతుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధనలో వెల్లడైంది. "The Effects of Acute Respiratory Distress on the Immune System"అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. సుదీర్ఘకాలం ఇలానే కొనసాగితే జ్ఞాపకశక్తి, లెర్నింగ్, నిద్రవంటి వాటిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా ఆలోచించడంలో, నిర్ణయాలు తీసుకోవటంలోనూ ఇబ్బందులు ఏర్పడతాయని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వీటికి అదనంగా యాంగ్జయిటీ, కుంగుబాటు వంటివి వస్తాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి కారణాలు ఏంటి? పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్క్రీన్‌ ఆప్నియాకు కారణాలేంటంటే

  • ఒకే పొజిషన్​లో కూర్చొని పనిచేయటం
  • ఎక్కువ సేపు తెరను చూడటం వల్ల కళ్లు అలసిపోవటం
  • పదేపదే మన దృష్టి మరల్చుకోవాల్సి రావడం
  • వచ్చిన మెసేజ్‌లకు, ఈమెయిళ్లకు వెంటనే స్పందించాలనే ఒత్తిడి

పరిష్కారాలివే

శ్వాస వ్యాయామాలతో:ముఖ్యంగా శ్వాస సరిగా తీసుకోకపోవడమే ఈ సమస్యకు మూల కారణమని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఎంత పని ఉన్నా సరే ఒక్క క్షణం ఆగి, దృష్టిని శ్వాస మీద ఉంచాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగా ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను గమనిస్తుండాలని చెబుతున్నారు. ఇందుకోసం 4-7-8 టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందుకోసం ముందుగా వెన్నెముకను నిటారుగా ఉంచి, కూర్చోవాలట. ఆ తర్వాత నాలుకను అంగిటికి ఆనించి.. 4సెకన్లపాటు గాలి పీలుస్తూ 7 సెకన్లు ఆ శ్వాసను అలానే బిగపట్టి ఉంచాలని పేర్కొన్నారు. ఆ తరవాత మరో 8 సెకన్ల పాటు పీల్చిన గాలిని వదిలేయాలని వివరిస్తున్నారు. అలా గంటకోసారైనా చేస్తుండాలని సలహా ఇస్తున్నారు.

బ్రేక్‌ తీసుకోవాలట:ప్రతి అరగంటకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి, అటూ ఇటూ రెండు అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా దీర్ఘశ్వాసను తీసుకోవాలని.. అవసరమైతే ఇందుకోసం టైమర్‌ కూడా పెట్టుకోవచ్చని అంటున్నారు. దీనివల్ల శరీరం, మెదడులపై పడే ఒత్తిడి తగ్గుతుందని వివరిస్తున్నారు.

కళ్లు ప్రశాంతంగా:కళ్లు అలసిపోవడం కూడా ఈ స్క్రీన్‌ ఆప్నియాకు మరో ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఇందుకు పరిష్కారంగా 20-20-20 నియమాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకన్లపాటు చూడాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల కళ్లు అలసిపోకుండా ఉంటాయని వివరిస్తున్నారు. 2015లో American Academy of Ophthalmology (AAO)లో ప్రచురితమైన "Eye care in the digital age" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.

ఇన్‌బాక్స్‌ జీరో వద్దు:మనలో చాలా మందికి చాట్‌బాక్స్‌లో చదవని మెసేజ్‌ ఉందంటే చాలు.. వెంటనే దాన్ని చూసేయాలి అన్న ఆసక్తి మొదలవుతుంది. ఫలితంగా ఇదీ మనలో ఒత్తిడికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇన్‌బాక్స్‌ జీరో కాన్సెప్ట్‌నకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి మెసేజ్‌కీ, ఈ- మెయిల్‌కీ వెంటనే స్పందించాలనుకోవద్దని.. దానికంటూ ఓ ప్రత్యేక సమయం కేటాయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మగవారికంటే మహిళల గుండె గట్టిదా? లేడీస్​కు హార్ట్ ప్రాబ్లమ్స్​ ఎందుక తక్కువ?

మధ్యాహ్నం పని చేస్తుంటే నిద్ర వస్తుందా? ఆఫీస్ టైమ్​లో పడుకోవద్దంటే ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details