Schizophrenia Causes and Symptoms: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్ సాధించడానికి మనిషి లైఫ్ స్టైల్లో అనేక మార్పులు మొదలయ్యాయి. అయితే ఈ స్పీడ్‌ను అందుకోవడంలో కొంత మంది ఇబ్బంది పడుతుంటారు. కాంపిటీషన్, స్ట్రెస్ తట్టుకోలేక.. తీవ్రమైన యాంగ్జైటీకి గురై.. శారీరక, మానసిక రుగ్మతల బారినపడతారు. దీంతో.. తన బతుకు ఇంతే అనే ఒక రకమైన భావనలోకి వెళ్లిపోతారు. తమదైన ఒక ప్రపంచాన్ని ఊహించుకుని, వింత ప్రవర్తనలతో బతికేస్తుంటారు. ఈ స్థితిని స్కిజోఫ్రెనియా అంటారు. ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఏం చేయాలో అర్థం కాక, తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం కూడా ఉంది.
ఏ వయసు వారిలో..
స్కిజోఫ్రెనియా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 24 మిలియన్ల మందిని లేదా ప్రతి 300 మందిలో ఒకరిని (0.32%) ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. ఈ వ్యాధి బారిన పడిన రోగి.. వాస్తవ ప్రపంచానికి, పరిస్థితులకు దూరంగా జీవిస్తుంటారు. వయసు, జెండర్, వృత్తి పరంగా ఎటువంటి సంబంధం లేకుండా.. ఎవరైనా సరే ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంది. ఒకవేళ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు ఈ వ్యాధి బారినపడితే, అది జీవితాంతం పీడించే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధి రావడానికి కారణాలు..
- స్కిజోఫ్రెనియా రావడానికి నిర్ధిష్టమైన కారణమేమిటో ఇప్పటి వరకూ స్పష్టం కాలేదు.
- అయితే జన్యుపరమైన, పర్యావరణ, బ్రెయిన్ కెమిస్ట్రీలో మార్పులు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ వ్యాధి రావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- అలాగే మెదడులో ఉండే డోపమైన్, గ్లూటమేట్, సెరటోనిన్ లాంటి న్యూరో కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనిషి సాధారణ ఆలోచనా విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి.
- టీనేజ్, యవ్వనంలో సైకోయాక్టివ్, సైకోట్రోపిక్ మందులు తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్ కెమికల్స్‌లో మార్పులు రావొచ్చు.
- విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి చేసే కొన్ని సంఘటనలు కూడా ఈ వ్యాధి బారినపడడానికి కారణం కావచ్చు.
- వంశపారం పర్యంగా కూడా పెద్దల నుంచి సంతానానికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
- పోషకాహార లోపం, మెదడు ఎదుగుదలను ప్రభావితం చేసే టాక్సిన్స్, వైరస్‌లకు గురికావడం, గర్భంలో ఉన్నప్పుడు బ్రెయిన్ గ్రోత్ సరిగా లేకపోవడం లాంటి సమస్యలు కూడా స్కిజోఫ్రెనియాకు ఒక కారణమే.