Rapid Weight Loss Problems : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి కారణాలుగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇలా అధిక బరువుతో బాధపడుతున్న వారు వెయిట్ లాస్‌అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరి కఠిన వ్యాయామాలు, డైట్ పాటిస్తుంటారు. ఇంకొందరు వేర్వేరు షార్ట్ కట్ మార్గాలు వెతుక్కుంటారు. అయితే.. ఇలా తక్కువ టైమ్‌లో ఎక్కువ బరువు తగ్గడం వల్ల.. పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాహార లోపం :
మెజార్టీ జనాలు బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. అయితే.. బరువు తగ్గడానికి మితిమీరిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ, క్రాష్ డైట్స్ పాటించడం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీరిలో పోషకాహార లోపం కనిపిస్తుందని అంటున్నారు. కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారు వైద్యుల సూచనలు తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు.
పరిశోధన వివరాలు :
2018లో "Obesity" అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వేగంగా బరువు తగ్గిన వారిలో, నెమ్మదిగా వెయిట్ లాస్ అయిన వారికంటే ఎక్కువ అలసట, బలహీనంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్‌లోని 'కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం'లో పని చేసే డాక్టర్. డేవిడ్ లోడెన్ (Dr. David Laudon) పాల్గొన్నారు. వేగంగా బరువు తగ్గిన వ్యక్తులలో మిగతా వారికంటే ఎక్కువ అలసట, బలహీనత ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
కండరాలు శక్తిని కోల్పోతాయి :
వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరంలోని కొవ్వుతోపాటు కండరాలు శక్తిని కోల్పోతాయి. దీనివల్ల అలసట, బలహీనతగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుందట. కాబట్టి, బరువు తగ్గడానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్న వారు శరీరంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో చూసుకోవాలి. దానికి తగినట్టు వ్యాయామం చేసే సమయాన్ని తగ్గించుకోవడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం చేయాలని సూచిస్తున్నారు.