Psoriasis Skin Disease Causes:మనకు ఎక్కువగా కనిపించే చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ఒకటి. ఎర్రటి మచ్చలు, తెల్లటి పొలుసులతో దీర్ఘకాలం వేధించే ఈ సమస్య వల్ల చర్మంపైన చేపల పొలుసులాంటి వాపుతో పాటు దురద, నొప్పి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దీనికి గల కారణాలపైన అనేక అధ్యయనాలు చేసిన పరశోధకులు తాజాగా ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. Nature Communications జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం సొరియాసిస్‌ను హెప్సిడిన్ అనే హార్మోన్ ప్రేరేపిస్తున్నట్టు తేలింది. "Skin hepcidin initiates psoriasiform skin inflammation via Fe-driven hyperproliferation and neutrophil recruitment" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో డాక్టర్లు Eliane Abboud, Diana Chrayteh పాల్గొన్నారు. అందువల్ల హెప్సిడిన్‌ను సొరియాసిస్‌కు బలమైన కారకంగా నిపుణులు పరిగణిస్తున్నారు.
అయితే, సాధారణంగా ఈ హార్మోన్ క్షీరదాల్లో ఐరన్ మోతాదులను పర్యవేక్షిస్తుంటుంది. ఆహారం నుంచి ఐరన్‌ను ఎంత మోతాదులో గ్రహించుకోవాలి? తర్వాత దాన్ని శరీరంలోకి ఎంత విడుదల చేయాలనే విషయాన్ని ఇది నియంత్రిస్తుంది. మనకు చాలా కీలకమైన ఐరన్.. ఒంట్లో రక్తం ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేయటంతో పాటు చర్మ ఆరోగ్యానికీ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గాయాలను మాన్పటం, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, కొలాజెన్ ఉత్పత్తి వంటి ముఖ్యమైన ప్రక్రియల్లోనూ పాలు పంచుకుంటుందని వివరించారు.
కానీ చర్మంలో ఐరన్ మోతాదులు పెరిగితే మాత్రం హానికరంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది అతి నీలలోహిత సూర్యకాంతి దుష్ప్రభావాలను పెంచుతుందని తెలిపారు. ఫలితంగా కణాలు విపరీతంగా వృద్ధి చెందే సొరియాసిస్‌వంటి దీర్ఘకాల సమస్యలకూ దారితీస్తుందని చెబుతున్నారు. సొరియాసిస్ బాధితుల చర్మ కణాల్లో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటున్నట్టు చాలాకాలం క్రితమే పరిశోధనల్లో బయటపడింది. కానీ దీనికి కారణమేంటి? సొరియాసిస్‌కూ దీనికీ ఉన్న సంబంధమేంటి? అన్న విషయాలు తెలియరాలేదు. అయితే, తాజాగా చేసిన అధ్యయనాల్లో ఇందుకు హెప్సిడిన్ హార్మోన్ కారణం కావొచ్చని తేలింది. ఆరోగ్యవంతుల్లో ఇది కాలేయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని.. సొరియాసిస్ బాధితుల్లో చర్మంలోనూ పుట్టుకొస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.