ETV Bharat / health

బీపీ, షుగర్ ఉన్నవాళ్లు బొప్పాయి తినొచ్చా? - ఏం జరుగుతుంది? - IS PAPAYA GOOD FOR DIABETES

- కీలక విషయాలు వెల్లడించిన పరిశోధన - ఇలా చేయాలంటున్న నిపుణులు

Is Papaya Good for Diabetes and High BP
Is Papaya Good for Diabetes and High BP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 2:39 PM IST

Is Papaya Good for Diabetes and High BP: సీజన్​తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. పసుపు రంగులో నిగనిగలాడుతూ తియ్యటి రుచితో లభించే ఈ బొప్పాయిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్​తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయిని షుగర్​, హైబీపీతో బాధపడేవారు తినొచ్చా? అనే డౌట్ చాలా మందిలో​ ఉంటుంది. మరి దీనికి వైద్య నిపుణులు ఏం సమాధానం ఇస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బొప్పాయి ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : రోజూ బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియలో తలెత్తే సమస్యలను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యంగా : బొప్పాయిలో లైకోపిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌, విటమిన్‌ సి ఎక్కువగా ఉంటాయని, ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ బొప్పాయి పండు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది : ఈ పండులో ఉండే లైకోపిన్‌ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ కొన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందని పలు పరిశోధనల్లో సైతం తేలినట్లు నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది : బొప్పాయిని తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, ఫలితంగా బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.

నేచురల్ డీటాక్సిఫికేషన్ : బొప్పాయిలో ఫైబర్, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుందని, ఇది నేచురల్ డిటాక్సిఫికేషన్​గా పనిచేస్తుందని చెబుతున్నారు. అంటే బొప్పాయిని ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలను సులభంగా తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.

షుగర్​, హైబీపీ ఉన్నవాళ్లు బొప్పాయి తినొచ్చా?: డయాబెటిస్​తో బాధపడేవారు బొప్పాయిని తినొచ్చని, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్​ మితంగా ఉంటుందని, హై గ్లైసెమిక్​ పండ్లతో పోలిస్తే ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవని చెబుతున్నారు. అలాగే బొప్పాయిలోని ఫ్లేవనాయిడ్లు, ఇన్సులిన్​ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని, రక్తంలో షుగర్​ లెవల్స్​ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతుందని వివరిస్తున్నారు.

2019లో జర్నల్​ ఆఫ్​ ఫంక్షనల్​ ఫుడ్స్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, బొప్పాయి ఇన్సులిన్​ సెన్సిటివిటీ పెంచడంతోపాటు ఇనఫ్లమేషన్​ను తగ్గిస్తుందని కనుగొన్నారు. అంతేకాకుండా నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు సంబంధించిన నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో కూడా ఇది స్పష్టమైంది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

కేవలం డయాబెటిస్​తో బాధపడేవారు మాత్రమే కాకుండా అధిక రక్తపోటుతో ఇబ్బందిపడేవారికి కూడా బొప్పాయి మేలు చేస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయిలో పొటాషియం పుష్కలంగా ఉంటుందని, ఇది శరీరంలోని అధిక సోడియంను తొలగించి హైబీపీని కంట్రోల్లో ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మొత్తంలో తినొద్దని సూచిస్తున్నారు. అలాగే డయాబెటిస్​, హైబీపీతో బాధపడేవారు బొప్పాయిని తినేముందు డాక్టర్ల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మూడో భోజనం అప్పుడు తింటే మీకు మూడినట్టే - షుగర్​ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువట!

అన్నం లేదా చపాతీ - షుగర్​ తగ్గేందుకు ఏది తింటే మంచిది? - నిపుణుల సమాధానమిదే!

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.