Side Effects Of Protein Powder :ఆరు పలకల దేహం..కండలు తిరిగిన బాడీ కోసం ప్రొటీన్ పౌడర్ వాడేవారందరూ అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ఈ ప్రొటీన్ పౌడర్ అధికంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాహార లోపం :ప్రొటీన్ పొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో పోషకాల అసమతుల్యత ఏర్పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ పొడిలో ఎక్కువ మొత్తంలో ప్రొటీన్(Protein)మాత్రమే లభిస్తుంది. దాంతో మిగతా పోషకాలు సరిగ్గా అందక బ్యాలెన్సింగ్ సమస్య తలెత్తవచ్చంటున్నారు.
కీడ్నీల మీద ప్రభావం : అధికమొత్తంలో ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చంటున్నారు. ప్రొటీన్ జీర్ణమయ్యాక మిగిలిపోయే అమ్మోనియా బయటకు వెళ్లిపోవాల్సిందే. ఇది చాలా వరకూ యూరిన్ ద్వారానే పోతుంది. దీంతో కిడ్నీల మీద ఎక్కువ భారం పడి వాటి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
జీర్ణ సమస్యలు :ప్రొటీన్ పొడులతో కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. బటానీ ప్రొటీన్ తీసుకున్నవారికి కడుపుబ్బరం వంటి ప్రాబ్లమ్స్ రావొచ్చట. అలాగే.. పాలలో ఉండే లాక్టోజ్ అనే చక్కెర పడనివారికి కడుపునొప్పి, విరేచనాల వంటి వాటికి దారితీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
విషతుల్యాలతో ప్రమాదం :కొన్ని ప్రొటీన్ పొడుల్లో విషతుల్యాలు, పురుగుమందుల అవశేషాలూ ఉండే అవకాశం ఉందట. ఫలితంగా.. వీటిని తీసుకోవడం వల్ల తలనొప్పి, అలసట, మలబద్ధకంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు.
కాలేయానికి నష్టం :ప్రొటీన్ పౌడర్స్ ఎక్కువగా తీసుకోవడం కాలేయం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని పొడుల్లో ఉండే డెక్స్ట్రోజ్ అనే ఒక రకమైన చక్కెర పదార్థం ఇందుకు కారణం కావొచ్చంటున్నారు.