New Year Resolution to Stop Eating Sugar : కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే క్రమంలో చాలా మంది ఆరోగ్యం, ఫిటనెస్ విషయంలో పలు తీర్మానాలు చేసుకుంటారు. ఎక్కువ మంది వాకింగ్ చేయాలని, ఆయిల్ ఫుడ్, స్వీట్స్‌కు దూరంగా ఉండాలని న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటారు. అయితే, మిగతా నిర్ణయాలు ఎలా ఉన్నా.. ఎక్కువ మంది స్వీట్లు తినాలనే కోరిక విషయంలో అదుపు తప్పుతారు. స్వీట్లు చూస్తే చాలు.. 'ఒక్కటే కదా ఏమవుతుంది' అని తింటుంటారు. ఇలా తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాలంలో బీపీ, మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీరు కూడా ఇలా స్వీట్ రిజల్యూషన్ తీసుకున్నారా ? ఈ రిజల్యూషన్ నెరవేరడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
మనలో చాలా మందికి మార్నింగ్ వేడివేడి కాఫీ/టీ/గ్లాసు పాలు తాగకుండా డే స్టార్ట్ కాదు. అయితే, ఇలా ఏది తీసుకున్నా అందులో సరిపడా షుగర్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. దీంతో పాటు వివిధ మిఠాయిల తయారీలోనూ పంచదార వాడే వారే ఎక్కువ. ఇక స్వీట్ షాపులో దొరికే స్వీట్స్ దాదాపు షుగర్‌తో తయారైనవే ఎక్కువగా ఉంటాయి. అయితే షుగర్‌కు బదులుగా బెల్లం, తేనె, డేట్స్.. వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిది. వీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో..మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కొంతమంది బిస్కట్లు, పఫ్స్ వంటివి తింటుంటారు. అలా కాకుండా ఓట్స్, చక్కెర వేయకుండా తయారుచేసిన పండ్ల రసాలు, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, చిరుధాన్యాలు-తృణధాన్యాలతో చేసిన వంటకాలు తినాలంటున్నారు. ఈ ఆహార పదార్థాల్లో షుగర్ స్థాయులు తక్కువగా ఉండడంతో పాటు.. వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయని చెబుతున్నారు.
దూరంగా ఉంటేనే మంచిది:ఇటీవల కాలంలో బర్త్‌డే, మ్యారేజ్ డే, పార్టీ, ఫంక్షన్స్ ఇలా ఏదైనా కేక్, కూల్‌డ్రింక్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడం ట్రెండింగ్‌గా మారింది. వేడుకల పేరుతోనే కాదు.. బేకరీ కనిపిస్తే చాలు.. అందులోకెళ్లి కేక్స్, కూల్‌డ్రింక్స్‌ని తీసుకుంటుంటారు. అయితే వీటిలో షుగర్ స్థాయులు అధికంగా ఉంటాయి. అలాంటి వారు తమ ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే స్వీట్లు, తీపి పదార్థాలు,కూల్‌డ్రింక్స్ వంటివి తినడం వల్ల టైప్-2 డయాబెటిస్, ఊబకాయం, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని National Institutes of Health (NIH) నిపుణుల బృందం వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
లేబుల్ చూశాకే కొనండి!బయట దొరికే ప్యాక్డ్ ఫుడ్స్‌పై ఉన్న లేబుల్‌ని చదివే అలవాటు ఎక్కువ మందికి ఉండదు! చూడడానికి బాగా ఉందని ఆయా ఫుడ్ ప్యాకెట్స్‌ని ట్రాలీలో వేసుకుంటారే కానీ.. అందులో ఉన్న పోషక విలువలేంటి, వాడిన పదార్థాలేంటి.. అన్న విషయాలు అసలు పట్టించుకోరు. అలా కాకుండా, ఈ న్యూ ఇయర్ నుంచి బయటి ఏది కొన్నా సరే.. ముందుగా లేబుల్‌ని తప్పనిసరిగా చదవమంటున్నారు. ఈ క్రమంలో షుగర్ ఎక్కువగా వాడిన వాటిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేయండి. ఇలా కొనే ముందు ఫుడ్ ఐటమ్స్ లేబుల్‌ని చూడడం అలవాటు చేసుకుంటే.. వాటిలో మన శరీరానికి అనవసరం అనుకున్న వాటిని పక్కన పెట్టేసి అవసరమైనవే ఎంచుకునే వీలుంటుంది. ఫలితంగా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.