తెలంగాణ

telangana

ETV Bharat / health

మెడ నొప్పి రావడానికి కారణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వైద్యుల సూచనలు - Neck Pain Causes - NECK PAIN CAUSES

Neck Pain : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌, ల్యాపీ, పీసీలను గంటలకొద్దీ వాడకుండా ఉండలేని పరిస్థితి. ఇలా వాడుతూ ఉంటే ఒక్కోసారి మెడనొప్పి, వెన్ను నొప్పులు ఇంబ్బందికి గురిచేస్తుంటాయి. అయితే, మనం మెడను సరైన స్థితిలో ఉంచనప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు అంటున్నారు. మెడ వంచే విధానం, కూర్చునే పద్ధతి ఎలా ఉండాలి, పడుకునే పద్దతి ఎలా ఉండాలి, వైద్యులు ఏం అంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Neck Pain
Neck Pain (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Sep 21, 2024, 10:15 AM IST

Neck Pain : ఫోన్​లో గంటల తరబడి మాట్లాడేవారికి, కంప్యూటర్, ల్యాప్‌టాప్​లను ఎక్కువగా వాడేవారి మెడపై భారం పడుతుందని ప్రముఖ వైద్యలు, స్పైన్ సర్జన్ జీ.వీ.పీ. సుబ్బయ్య తెలుపుతున్నారు. ఇలా మీరు రోజు అజాగ్రత్తతో చేసే పనులన్నీ మెడ మీద పెద్ద భారాన్నే మోపుతాయని అంటున్నారు. తద్వారా అది మెడ నొప్పికి దారితీస్తుంటాయని తెలుపుతున్నారు. నిజానికి మెడ నొప్పి ఉన్నట్టుండి తలెత్తేది కాదని, దీనికి చాలాకాలం కిందే బీజం పడుతూ వస్తుందంటున్నారు. కీళ్లలో వాపు (ఆర్థ్రయిటిస్‌), వెన్నుపూసల మధ్య డిస్కులు క్షీణించటం వంటి సమస్యలతో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇబ్బందులు ఎక్కువవుతాయంటున్నారు. మీ శరీర భంగిమ దెబ్బతినటం లేదా కండరాల బలం తగ్గటం, ఒత్తిడి, నిద్రలేమి లాంటి అంశాలు మెడ నొప్పిని పెంచుతాయంటున్నారు. అందుకే మెడ నొప్పిని తేలికగా తీసుకోవటానికి లేదని, కొన్ని జాగ్రత్తలతో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్యుల సూచనలు

  • ఒకసారి మీ శరీర భంగిమ దెబ్బతిందంటే తిరిగి సరి చేయటం అంత సులువు కాదు. కాబట్టి ఒకే పొజిషన్​లో చాలా సేపటివరకూ కూర్చోకుండా చూసుకోవాలంటున్నారు వైద్యులు గంటల కొద్దీ కూర్చోకుండా, అప్పుడప్పుడూ లేచి, నాలుగడుగులు వేయాలని సూచిస్తున్నారు.
  • కుర్చీలు, టేబుళ్ల వంటివాటినీ మీ మెడకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. కంప్యూటర్‌ మానిటర్‌ పైభాగం కళ్లకు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఫోన్‌లో హ్యాండ్స్‌ ఫ్రీ ఫీచర్‌ను వాడుకోవాలని, హెడ్‌సెట్‌ అయినా ధరించొచ్చంటున్నారు. ట్యాబ్లెట్‌ను ఒడిలో కన్నా దిండు మీద పెట్టుకుంటే 45 డిగ్రీల కోణంలో కుదురుకుంటుందని తద్వారా మెడలపై ప్రభావం పడదంటున్నారు వైద్యులు.
  • కళ్లద్దాలు వాడేవారు ఎప్పటికప్పుడు దృష్టి లోపానికి తగినట్టుగా సరి చేసుకోవాలంటున్నారు. లేకపోతే స్పష్టంగా కనిపించటానికి తలను వెనక్కి వంచి చూడాల్సి వస్తుందంటున్నారు.
  • పడుకున్న సమయంలో దిండు మరీ ఎత్తుగా ఉంటే మెడ కదిలికపై ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్యులు. అందువల్ల దిండు మెడకు సమానంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. నిద్ర సమస్యలతో కండరాలు, ఎముకల నొప్పి వంటి వివిధ రకరకాల జబ్బులకు దారితీస్తాయి. అందువల్ల కంటి నిండా నిద్రపోయేలా జాగ్రత్త వహించాలంటున్నారు వైద్యులు.
  • భారీ వస్తువులను కదిలించేటప్పుడు అవి మెడ, వీపు మీద ఎంత భారం వేస్తున్నాయో గమనించుకోవాలని, మరీ అవసరమైతే ఇతరుల సాయాన్ని తీసుకోవాలంటున్నారు వైద్యులు.
  • సాధారణంగా మెడ నొప్పికి పెద్దగా భయపడాల్సిన పనిలేదని, కానీ నొప్పి భుజంలోకి, శరీరం కింది భాగాల్లోకి పాకుండా జాగ్రత వహించాలంటున్నారు వైద్యులు. చేయి లేదా కాలు బలహీనత, మొద్దుబారటం వంటివి గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. మెడ నొప్పితో పాటు బరువు తగ్గటం, జ్వరం వస్తున్నా నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇదే విషయాన్ని NIH బృందం కూడా వెల్లడించింది. (National Institutes of Health) రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Neck Pain Treatment : మెడనొప్పికి కారణాలేంటో తెలుసా?.. ఇలా చేస్తే అంతా సెట్​!

ఇలా కూర్చుంటే కండరాలపై ఒత్తిడి పడదు!

ABOUT THE AUTHOR

...view details