తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్​: బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్​ వస్తుందా? - నిపుణుల సమాధానమిదే! - MYTHS AND FACTS ABOUT WEARING BRA

- వక్షోజాలు, వెన్ను నొప్పిపైనా ప్రభావం చూపుతాయనే అనుమానాలు - నివృత్తి చేసిన నిపుణులు

Myths and Facts about Wearing Bra
Myths and Facts about Wearing Bra (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 7, 2024, 4:13 PM IST

Myths and Facts about Wearing Bra: బ్రా.. మహిళల జీవితంలో ఒక భాగం. ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాల బ్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మహిళల ఛాతీని తీరైన ఆకృతిలో కనిపించేలా చేయడంలో సహాయపడతాయి. అయితే ఇంత పాపులర్ అయిన బ్రాను ధరించే విషయంలో కొంతమందిలో కొన్ని రకాల సందేహాలుంటాయి. బ్రా ధరించకపోతే వక్షోజాలు సాగిపోతాయని.. వేసుకుంటే పెరుగుదల ఆగిపోతుందని, కొన్ని రకాల బ్రాసరీస్ బ్రెస్ట్​ క్యాన్సర్‌కు కారణమవుతాయని.. ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కో రకమైన సందేహం ఉంటుంది. మరి, వీటిలో నిజమెంత? దీనికి నిపుణులు ఏం సమాధానం ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

బ్రా వేసుకోకపోతే వక్షోజాలు సాగుతాయా?: సహజసిద్ధంగానే రొమ్ము కణజాలానికి సాగే గుణం ఉంటుంది. అందుకే గర్భం ధరించినప్పుడు, పాలిచ్చే సమయంలో ఈ కణజాలం సాగి ఛాతీ పెద్దగా కనిపిస్తుంది. మిగతా సమయాల్లో మామూలుగా ఉంటుంది. అయితే.. ఈ విషయంలో అవగాహన లేని వారు బ్రా వేసుకోకపోతే వక్షోజాలు సాగుతాయని అనుకుంటారు. ఇది నిజం కాదని చెబుతున్నారు నిపుణులు. బ్రెస్ట్​ పరిమాణం పెరగడానికి, బ్రా ధరించడానికి సంబంధం లేదని, లో దుస్తులు ధరించాలా, వద్దా అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇక బరువు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వీటి పరిమాణాల్లో కూడా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలూ లేకపోలేదంటున్నారు.

నడుం నొప్పి రాదా?: బ్రా ధరించడం వల్ల.. ఛాతీ ఆకృతే కాదు.. శరీర భంగిమ మెరుగుపడి నడుం నొప్పి రాకుండా జాగ్రత్తపడవచ్చనుకుంటారు చాలామంది. అయితే ఇందులో కూడా వాస్తవం లేదంటున్నారు నిపుణులు. బ్రా వేసుకోవడం వల్ల శరీర ఆకృతిలో ఎలాంటి మార్పులు రావని, నడుం నొప్పి రాదన్నది కూడా పూర్తిగా అవాస్తవమే అంటున్నారు. సరైన సైజు బ్రా.. సౌకర్యంగా ఫీల్​ అయ్యేలా చేస్తుందే తప్ప దీన్ని ధరించడం వల్ల నడుం నొప్పి రాకుండా అడ్డుకోవచ్చన్న ఆధారాలేవీ లేవంటున్నారు.

అన్ని వేళలా ధరించాలా?:రోజు మొత్తం బ్రా ధరించడం వల్ల ఛాతీ ఆకృతి మెరుగుపడుతుందనుకుంటారు కొంతమంది. అయితే దీనివల్ల ఛాతీ ఆకృతేమో గానీ అసౌకర్యంగా అనిపించడంతోపాటు అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజంతా బ్రా ధరించడం వల్ల ఛాతీకి గాలి తగలదని.. తద్వారా అక్కడ చెమట ఎక్కువగా వచ్చి చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. ఆ భాగంలో అలర్జీ, దురద, మృతకణాలు ఏర్పడడం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు. కాబట్టి అన్ని వేళలా బ్రా ధరించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా బ్రా లేకుండా నిద్ర పోవడమే ఛాతీ ఆరోగ్యానికి మేలని చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్​ వస్తుందా?: చాలా మందిలో బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్​ వస్తుందనే భయం ఉంటుంది. ముఖ్యంగా అండర్​వైర్​ బ్రా వేసుకుంటే ఇది మరింత ఎక్కువని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇందులో కూడా ఎలాంటి నిజమూ లేదని అంటున్నారు నిపుణులు. బ్రాలు ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్​ వస్తుందనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవని అంటున్నారు. పలు పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు నేషనల్​ బ్రెస్ట్​ క్యాన్సర్​ ఫౌండేషన్​ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది(రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

వీటితో పాటు ఛాతీ ఆకృతి, సైజును బట్టి సరైన సైజు బ్రా ఎంచుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలంటున్నారు. అప్పుడే బ్రా వేసుకుంటే సౌకర్యంగా ఉండడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తపడవచ్చని సలహా ఇస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జామకాయ, నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందా? - చలికాలంలో అవి తినకూడదా!

అందంగా కనిపించాలని "కాటుక" పెట్టుకుంటున్నారా ? - మెదడు, ఎముకలపై దుష్ప్రభావమట!

పేషెంట్ల నోరు, కళ్లలో ఫ్లాష్​లైట్ వేస్తే రోగం తెలిసిపోతుందా? డాక్టర్లు ఇలా ఎందుకు చేస్తారంటే?

ABOUT THE AUTHOR

...view details