Sleeping Time Facts in Telugu : 'తొందరగా నిద్రపోయి త్వరగా మేల్కోవాలి'.. చాలామంది చెప్పే విజయ సూత్రాల్లో ఇదీ ఒకటి. ఇల్లు, ఆఫీసు పనులతో రకరకాల టైంలో నిద్రించే అమ్మాయిల శాతమూ ఎక్కువే కదా! మరి అలాంటి వారికి సక్సస్ దక్కనట్లేనా? అంటే కాదని అంటున్నాయి తాజా అధ్యయనాలు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో స్లీపింగ్ టైమింగ్స్, మెదడు పనితీరుపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేశారు. రీసెర్చ్ కోసం 26వేల మందిని ఎంచుకున్నారట. అందులో వాళ్ల రీజనింగ్, ప్రతి స్పందించడం, మెమరీ, తెలివితేటలను పరీక్షించారట. తొందరగా నిద్రనుంచి మేల్కొనే అలవాటున్న వారికంటే లేటుగా నిద్రించే వారే చురుగ్గా ఉన్నారనీ, వాళ్ల ఐక్యూ కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
తొందరగా నిద్రలేవాలనే ఉద్దేశంతో - లేనిపోని సమస్యలు : మామూలుగా తెల్లవారు జామున లేచిన వారు పని సమర్థవంతంగా చేయగలుగుతారనీ అనుకుంటుంటాం. కానీ, ఈ పరిశోధనలను బట్టి చురుకుదనం అనేది మనం నిద్రలేచే సమయం మీద ఉండదనీ, ఆ నిద్ర ఎంత నాణ్యంగా ఉందనే దానిపైనే ఆధారపడి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. గాఢ నిద్ర వల్ల జ్ఞాపకశక్తి, ప్లాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సృజనాత్మకత, ఉత్పాదకతలు పెరుగుతాయట. తొందరగా నిద్రలేవాలనే ఆలోచనతో చాలామంది చాలీచాలని నిద్ర పోతున్నారట.
దీనివల్ల.. నిద్రలేమి సమస్యలు వచ్చి, అవి బ్రెయిన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయట. ప్రతిఒక్కరికీ జీవగడియారాలు వేరు వేరుగా ఉంటాయి. వాటిని అనుసరించి, కొంతమంది తొందరగా నిద్రలేస్తే, మరికొందరు ఆలస్యంగా నిద్రలేవొచ్చు. ఫలానా వేళలే సరైనవి అన్న పాలసీ పెట్టుకునే కంటే నాణ్యమైన నిద్ర ఉందా లేదా అన్నదే కీలకమని నిపుణుల అభిప్రాయం. అందువల్ల వీటిని దృష్టిలో ఉంచుకుని జీవన విధానాలను పాటిస్తే విజయం పక్కా!