Magnesium Deficiency Warning Signs :మన బాడీకి కావాల్సిన అతి ముఖ్యమైన ఖనిజాల్లో ఒకటి మెగ్నీషియం. ఇది శరీరంలో 300కి పైగా జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. శరీరంలో అంతటి ప్రధానమైన ఖనిజం లోపిస్తే.. అది పలు అనారోగ్య సమస్యలకు దారి తీయడమే కాకుండా ప్రాణాలకూ ముప్పు వాటిల్లవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీలో ఈ లక్షణాలున్నాయేమో ఓసారి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
కండరాల తిమ్మిర్లు : మీ శరీరంలో మెగ్నీషియం లోపించినట్లయితే మొదట కనిపించే హెచ్చరిక సంకేతం.. కండరాల తిమ్మిర్లు. కండరాల్లో నొప్పులూ ఉంటాయి. 2017లో 'Annals of Internal Medicine' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మెగ్నీషియం లోపం ఉన్న వ్యక్తులలో కండరాల తిమ్మిర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. ఈ పరిశోధనలో యూఎస్‌లోని కొలంబియా యూనివర్సిటీ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా ఉన్న రాబర్ట్ హెర్మన్ పాల్గొన్నారు. బాడీలో మెగ్నీషియం లెవల్స్ తగ్గితే కండరాలు తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.
అలసట, బలహీనత :మెగ్నీషియం బాడీలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి తగినంత స్థాయిలో మెగ్నీషియం లేకపోతే.. శరీరానికి అవసరమైన శక్తి అందదు. దాంతో అది విపరీతమైన అలసట, బలహీనతకు దారితీస్తుందంటున్నారు నిపుణులు.
హృదయ స్పందనలో తేడా :మెగ్నీషియం లోపించినట్లయితే హృదయ స్పందనలో తేడాలు వస్తాయంటున్నారు నిపుణులు. గుండె సాధారణ వేగం కంటే ఎక్కువగా కొట్టుకుంటుందని చెబుతున్నారు.
అధిక రక్తపోటు : కొన్ని అధ్యయనాలు శరీరంలో తక్కువ మెగ్నీషియం స్థాయిలు అధిక రక్తపోటుతో సంబంధం కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మెగ్నీషియం ఉండే ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.