Less Sleep Side Effects : మనిషి ఆరోగ్యంగా ఉండటానికి 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతుంటారు. సరిపడా నిద్రలేకపోతే మాత్రం.. నిస్సత్తువ, ఒత్తిడి, చిరాకు, ఏకాగ్రత లోపించటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలంలో బరువు పెరగడంతోపాటు బీపీ, షుగర్ కూడా ఎటాక్ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమితో కలిగే జబ్బులు :
అధిక రక్తపోటు : దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అయితే, సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది. రోజూ సరిగ్గా నిద్రపోక పోవడం కారణంగా రక్తపోటు పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల లాంగ్ టైమ్‌లో గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మధుమేహం : చాలా మంది నిద్రకు షుగర్ వ్యాధికి ఎటువంటి సంబంధం ఉండదని అనుకుంటారు. అయితే.. ప్రతిరోజూ తక్కువ సమయం నిద్రపోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందట. నిద్రలేమితో కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవని నిపుణులంటున్నారు. దీనివల్ల కణాల్లోకి గ్లూకోజు చేరుకోదు. దీంతో.. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయని ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ (రిటైర్డ్) అశ్వినీ కుమార్ తెలిపారు.
2019లో "PLOS One" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రోజూ రాత్రి 5 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 26 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని 'చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్'లో పనిచేసే డాక్టర్ జింగాంగ్ లీ (Xingang Li) పాల్గొన్నారు. రాత్రి తక్కువసేపు నిద్రపోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.