Leg Cramps Reasons and Remedies:మీరు హాయిగా నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా పిక్కలు పట్టేస్తున్నాయా? ఇది చాలా మందికి జరిగే ఉంటుంది. ఇది కొద్దిసేపే అయినా తీవ్రమైన నొప్పితో వేధిస్తూ నిద్రలో నుంచి లేచిపోతుంటారు. ముఖ్యంగా పెద్దవారిలో సుమారు 50-60% మంది జీవితంలో ఎప్పుడో అప్పుడు దీని బారినపడ్డవారే ఉంటారు. ఫలితంగా దాదాపు 20శాతం మందిని చాలా అసౌకర్యానికి, నిద్రలేమికి గురి చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు గల కారణాలు? పరిష్కార మార్గాలు ఏంటో ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాలు హఠాత్తుగా, అసంకల్పితంగా సంకోచించటం వల్ల పిక్కలు పట్టేస్తుంటాయని డాక్టర్ ఎంవీ రావు వివరించారు. ఇదేమీ హానికరం కాకపోయినా.. ఉన్నట్టుండి తీవ్రమైన నొప్పి పుట్టి ఇబ్బంది పెడుతుందని చెబుతున్నారు. అయితే, పిక్కలు పట్టేయటానికి ప్రధాన కారణం కండరాల సంకోచ, వ్యాకోచాలకు తోడ్పడే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాల మోతాదులు తగ్గడమేనని పేర్కొన్నారు.
మధుమేహం వల్ల కూడా పట్టేస్తాయట!
పిక్కలు పట్టేయడానికి రకరకాల సమస్యలు దోహదం చేస్తుంటాయని.. మధుమేహం నియంత్రణలో లేకపోవటం కూడా ఒక కారణమని వివరించారు. కండరాలు సరిగా బిగుసుకోవటానికి, వదులు కావటానికి గ్లూకోజు అవసరమని.. అయితే మధుమేహుల్లో గ్లూకోజు ఎక్కువగా ఉన్నా అది కండరాలకు ఉపయోగపడదని తెలిపారు. ఫలితంగా కండరాల్లో తలెత్తే జీవక్రియ మార్పులు సంకోచ, వ్యాకోచాలను అస్తవ్యస్తం చేస్తాయని చెబుతున్నారు. మరోవైపు మధుమేహుల్లో నాడులు, రక్తనాళాలు దెబ్బతింటుంటాయని.. ఫలితంగా రక్త ప్రసరణ తగ్గిపోయి పిక్కలు పట్టేసినట్టు నొప్పి రావొచ్చని అంటున్నారు.
మూత్రం ఎక్కువగా రావటమూ సమస్యే
కండరాలు పట్టేయడానికి మూత్రం ఎక్కువగా రావటమూ సమస్యేనని నిపుణులు చెబుతున్నారు. మూత్రంతో పాటు శరీరంలోని అనేక లవణాలూ బయటకుపోయి ఇలా జరుగుతుందని వివరించారు. ఇంకా మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులతోనూ సోడియం, పొటాషియం స్థాయులు పడిపోవచ్చని.. ఫలితంగా ఇలా జరుగుతుందని అంటున్నారు.
ఎలక్ట్రోలైట్ల మార్పులతో పట్టేయొచ్చు!
కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్ సైతం ఈ కండరాల సమస్యకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకోసారి కిడ్నీ సమస్యల్లోనూ ఎలక్ట్రోలైట్ల మార్పులతో పిక్కలు పట్టేయొచ్చని.. కాబట్టి కారణాన్ని గుర్తించి, చికిత్స తీసుకుంటే సమస్య నయమైపోతుందని అంటున్నారు.