Excess Water Intake Side Effects: నీరు ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం మంచిదే అయినా.. ఇదీ మోతాదులోనే ఉండాలని వివరిస్తున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలి? ఏ సమయంలో నీరు తాగాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేవగానే పరగడుపున లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం మంచిది కాదని పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. శారీరక శ్రమ, వాతావరణ పరిస్థితులు మనిషి ఎంత నీరు తాగాలనేది నిర్ణయిస్తాయని వెల్లడించారు. ఎండలో పొలంలో శ్రమిస్తున్న రైతుకు.. ఏసీలో కూర్చొని పని చేస్తున్న వ్యక్తి కంటే ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయని వివరించారు. ఇలా వేడి, తేమతో కూడిన వాతావరణం, ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారు, క్రీడాకారులు.. ఇతరుల కంటే ఎక్కువగా నీరు తాగాలని సలహా ఇస్తున్నారు.
"సుమారు 70 కిలోల బరువుండి, సాధారణ ఆరోగ్య పరిస్థితి ఉన్న వ్యక్తులు రోజుకు 2 నుంచి రెండున్నర లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. సుమారుగా 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే, వీటిని ఒకేసారి కాకుండా గంట గంట వ్యవధిలో తాగాలి. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలతో నీటిని తీసుకోవాలి. మధుమేహం సమస్య ఉన్నవారిలో రక్తం చిక్క బడుతుంది. కాబట్టి రోజుకు రెండున్నర లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి."
--డాక్టర్ జానకీ శ్రీనాథ్, పోషకాహార నిపుణులు
ఇంకా అదే పనిగా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం గాఢత తగ్గి హైపోనట్రేమియా స్థితి వస్తుందని డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. ఫలితంగా వాంతులు, వికారం, తిమ్మిరి, అలసట వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. ఎక్కువ నీరు తాగితే పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందని.. ఫలితంగా శరీరంలో ఎలక్ట్రోలైట్‌ల స్థాయిలు పడిపోయి కండరాల తిమ్మిరి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పైగా పొటాషియం స్థాయిలు కూడా తగ్గి కాళ్లలో మంట, ఛాతీలో నొప్పి లాంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. దీంతో పాటు చారు, సాంబారు, పప్పుచారు, మజ్జిగ లాంటి ద్రవాలతో కలిసి అన్నం తినేప్పుడు అదేపనిగా నీటిని తాగాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు. అయితే, దోశ, చపాతి, ఉప్పుతో కూడిన ఆహారం, మసాలా ఆహారం తింటున్నప్పుడు నీటిని తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఎవరు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?
- మూడేళ్ల లోపు ఉన్న చిన్నారులు తల్లిపాలతో కలుపుకొని 4 కప్పులు (సుమారు 950 మిల్లీలీటర్లు)
- 4-8 ఏళ్ల పిల్లలు 5 కప్పులు (సుమారు 1.1 లీటర్లు)
- 8ఏళ్లు దాటిన పిల్లలు 7-8 కప్పులు (సుమారు 1.8 లీటర్లు)
- మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీళ్లు
- పురుషులు రోజుకు 3.7 లీటర్ల నీళ్లు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బాడీ పెయిన్స్ తీవ్రంగా ఉన్నాయా? ట్యాబ్లెట్స్ వేయకుండా కారణాలు తెలుసుకోండి!
చలికాలంలో గర్భిణీలు ఇవి తప్పక పాటించాలట! లేకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమేనట!