Health Benefits Of Okra Water : బెండకాయను కూరగానే కాకుండా.. 'బెండకాయ(Lady Finger) వాటర్ ప్రిపేర్ చేసుకొని తాగినా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన పురుషులు.. పరిగడుపునే ఈ వాటర్ తాగితే.. అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు. ఇంతకీ, ఈ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్‌కు దివ్య ఔషధం : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్(Diabetes) బారిన పడుతున్నారు. ఈ క్రమంలో డైలీ పరిగడపున బెండకాయ వాటర్ తాగడం మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు నిపుణులు. ఫార్మాస్యూటికల్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఓక్రా గింజలు, పీల్స్ యాంటీడయాబెటిక్ లక్షణాలను కలిగి ఉన్నాయని, అవి టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తాయని కనుగొన్నారు. కాబట్టి 30 ఏళ్లు నిండిన పురుషులు ఈ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన షుగర్ లెవల్స్ మెయింటెన్ చేయవచ్చంటున్నారు.
జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది : వయసు పెరిగే కొద్దీ పురుషులను రకరకాల జీర్ణ సమస్యలు వేధిస్తాయి. అలాంటి టైమ్‌లో డైలీ ఖాళీ కడుపున బెండకాయ వాటర్ తాగడం ఉత్తమ ఫలితాలనిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బెండలో పుష్కలంగా ఉండే ఫైబర్, జిగట పదార్థం ప్రేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు. ఫలితంగా ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమన కలిగిస్తుందని చెబుతున్నారు.
2010లో "జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. బెండలోని జెల్ (జిగట) పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను పెంచుతుందని, మలబద్ధకాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘైలోని తూర్పు చైనా విశ్వవిద్యాలయంలోని ఫుడ్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ డాంగ్-హో లీ పాల్గొన్నారు. బెండకాయలోని ఔషధ గుణాలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఇమ్యూనిటీ బూస్టర్ : బెండకాయలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి, 30 సంవత్సరాలు దాటిన పురుషులు డైలీ మార్నింగ్ బెండకాయ వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చంటున్నారు. ఫలితంగా జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు : అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. బెండలో ఉండే అధిక ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను (LDL) గణనీయంగా తగ్గిస్తుందని కనుగొన్నారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఓక్రాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.