Jaggery Health Benefits : సహజంగా తీపి గుణం కలిగిన బెల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. రోజూ కొంచెం బెల్లమైనా తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. మార్కెట్లో బెల్లం వివిధ రకాలుగా లభిస్తుంది. ఒక్కో బెల్లం ఒక్కో రకమైన ప్రయెజనాలను కలిగిస్తుందట. అసలు బెల్లం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏది తింటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందో చూద్దాం.
బెల్లం రకాలు
1. చెరుకు బెల్లం: చెరుకుతో తయారు చేసే బెల్లం చాలా సాధారణ రకం. వాస్తవానికి బెల్లం ఎంత ముదురు రంగులో ఉంటే అంత మంచిదట. ఈ రకంగా చూస్తే చెరుకు బెల్లం అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, నిర్విషీకరణకు అవసరమైన పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి.
2. తాటి బెల్లం:
తాటి చెట్ల రసంతో తయారు చేసే తాటి బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మనిషి శారీరక ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది.
3. ఖర్జూర బెల్లం:
ఖర్జూర చెట్టు ఆకుల రసం నుంచి తీసుకునేదే ఖర్జూర బెల్లం. దీన్నే ఖజూర్ బెల్లం అని కూడా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని చాలా మంది వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.
4. కొబ్బరి బెల్లం:
కొబ్బరి చెట్ల నుంచి తయారుచేసే కొబ్బరి బెల్లంలో పొటాషియానికి గొప్ప మూలం. రుచిలో పంచదార పాకంలా ఉండే ఈ కొబ్బరి బెల్లం చెరుకు బెల్లం కన్నా ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుందట.
5. నల్ల బెల్లం:
సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో నల్ల బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుందట. పలు రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాల తయారీలో నల్ల బెల్లాన్ని ఎక్కువగా ఉపయెగిస్తారు.
6. నువ్వుల బెల్లం:
వేయించిన నువ్వులతో తయారు చేసే ఈ బెల్లం ఆరోగ్యానికి చాలా రకాల ప్రయెజనాలను కలిగిస్తుందట. వీటిలోని కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
రోజూ బెల్లం తింటే ఏమవుతుంది?
పోషకాల గని:
బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలకు మూలం. ఇందులో శరీరానికి అవసరమైన బీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.