IT Hub-2 in Khammam : ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఐటీ ఉద్యోగం ఓ కల. ఐటీ ఉద్యోగాల కోసం గతంలో హైదరాబాద్, బెంగళూరు బాట పట్టాల్సి ఉండేది. కానీ జిల్లాల్లో ఐటీ హబ్‌ల రాకతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వాళ్ల ముంగిటకే వచ్చి చేరుతున్నాయి. ఖమ్మంలో కొలువు దీరిన ఐటీహబ్-1లో ఇప్పటికే దాదాపు 600 మంది ఉద్యోగాలు దక్కించుకొని ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. రెండో ఐటీ హబ్ విస్తరణ చేపట్టేందుకు మూడేళ్ల క్రితమే ముందడుగుపడినా ఇప్పటికీ అతీగతీ లేకుండాపోయింది. కొండంత ఆశతో ఐటీ కొలువులు దక్కుతాయని ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఖమ్మంలో ఐటీ హబ్-2 : ఐటీ హబ్ ఖమ్మం జిల్లాకు మణిహారంగా ఉంది. ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్య పూర్తి చేసి కొలువుల కల తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్న వందలాది మంది ఉపాధికి దిక్సూచిలా నిలిచింది. విదేశాల్లో ఐటీ కార్యకలాపాలు సాగిస్తున్న 13 కంపెనీలు ఖమ్మం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దాదాపు 600 మందికి పైగా కొలువులు సాధించారు. ఉపాధి పొందిన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వారుండటం గమనార్హం.
స్థానికంగా ఐటీ ఉద్యోగాలు : గతంలో ఐటీ ఉద్యోగాలకి హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఐటీ హబ్ ఏర్పాటుతో ఆ బాధ తప్పింది. స్థానికంగా ఐటీ ఉద్యోగాలు సులభంగా దక్కుతున్నాయి. కుటుంబంతో హాయిగా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఐటీహబ్-1 విజయవంతం కావడంతో పక్కనే రెండో ఐటీ హబ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 36 కోట్లతో పని మొదలు పెట్టినా మూడున్నరేళ్లుగా పనుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు.
ఐటీ హబ్-2 కొలువుదీరితే : బహుళజాతి కంపెనీల కార్యకలాపాలతో ఐటీ హబ్ విరాజిల్లుతోంది. ఐటీ హబ్-2 కొలువుదీరితే ఇంకా చాలా మందికి స్థానికంగా కొలువు దక్కనుంది. తొలి ఐటీహబ్ సేవలు దిగ్విజయంగా కొనసాగుతుండటంతో ఐటీ హబ్‌లో సేవల విస్తరణకు ప్రముఖ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. త్వరితగతిన ఐటీహబ్-2 నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని యువత ఆకాంక్షిస్తోంది. రెండో ఐటీ హబ్‌ను ప్రజా ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.