Kartika Deepotsavam 2024 : కార్తికమాసం చివరిసోమవారం ఈటీవీ చేపట్టిన కార్తిక దీపోత్సవం.. కన్నుల పండువగా జరిగింది. ఈటీవీ లైఫ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన దీపోత్సవంతో ఆధ్యాత్మిక వాతావరణ వెల్లువిరిసింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది. దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు.. పరమశివుని స్తోత్రించి దీపాలు వెలిగించి తన్మయత్వంలో మునిగిపోయారు. భాగ్యనగర వాసుల్లో ఆధ్యాత్మికతను తట్టిలేపింది. వందలాది భక్తుల శివనామస్మరణతో స్టేడియం మారుమోగింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోలాహలం నడుమ శివకేశవులతో సహా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్తిక దీపోత్సవంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రవచన కర్త చెప్పిన ఉపన్యాసం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
"కార్తిక సోమవారం నాడు ఇంత ఘనంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా అదృష్టంగా భావించాను. దీపోత్సవం అవ్వగానే రెండు నిమిషాలు ఉండి వెళ్లిపోదాం అనుకున్నాను.. కానీ ఇక్కడకు వచ్చిన భక్తులను చూశాక చివరి వరకు ఉండాలని అనిపించింది. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను." - గద్వాల విజయలక్ష్మీ, జీహెచ్ఎంసీ మేయర్
భక్తుల ఆనందం : ఈటీవీ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. దీపోత్సవంతో భాగ్యనగరం మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుందని చెప్పారు. రాబోయే తరాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు వివరించారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తిక మాసంలో మహారుద్రుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సామూహికంగా దీపారాధనలు చేయడంపై ఆనందించారు. అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన వారందరికీ మేయర్ జ్ఞాపికలు అందించారు.
"మా ప్రాంతంలో ఉన్న చాలా మంది భక్తులకు ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చక్కటి అనుభూతిని ఇస్తుంది. ప్రతి ఏడాది కార్తికదీపోత్సవ కార్యక్రమం ఇదే సరూర్ నగర్ స్టేడియంలో జరిపించాలని ఈటీవీ వారిని కోరుకుంటున్నాను. గతంలో ఈ కార్యక్రమం ఫిల్మ్‌సిటీలో చేసేవారు.. ఫిల్మ్‌సిటీ దూరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించాలి." - సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
కార్తిక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు? - దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా?
కార్తికమాసం స్పెషల్ : తెలంగాణలో ఉన్న ఈ శైవక్షేత్రాలు ఎంతో పవర్ఫుల్ - వీటి గురించి మీకు తెలుసా?